15
ప్రభువు రాకడ, మొదటి పునరుత్థానం
ప్రక 20:5; 11-15
సోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మీరు దాన్ని అంగీకరించి, దానిలోనే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వట్టిదైతే తప్ప, నేను మీకు ప్రకటించిన సువార్త ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకుని ఉంటే ఆ సువార్త ద్వారానే మీరు రక్షణ పొందుతూ ఉంటారు.
దేవుడు నాకనుగ్రహించిన ఉపదేశాన్ని మొదట మీకు ప్రకటించాను. అదేమంటే, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు, లేఖనాల ప్రకారం ఆయనను సమాధి చేశారు, దేవుడు ఆయనను మూడవ రోజున తిరిగి లేపాడు కూడా. ఆయన కేఫాకూ, తరువాత పన్నెండు మందికీ కనబడ్డాడు. ఆ తరువాత ఐదు వందలకంటే ఎక్కువైన సోదర సోదరీలకు ఒక్క సమయంలోనే కనిపించాడు. వారిలో చాలామంది ఇంకా జీవించే ఉన్నారు. కొందరు కన్ను మూశారు. తరువాత ఆయన యాకోబుకు, అటు తరువాత అపొస్తలులకందరికీ కనిపించాడు.
చివరిగా అకాలంలో పుట్టినట్టున్న నాకు కూడా కనిపించాడు. ఎందుకంటే నేను అపొస్తలులందరిలో తక్కువ వాణ్ణి. దేవుని సంఘాన్ని హింసించిన వాణ్ణి కాబట్టి నాకు అపొస్తలుడు అన్న పిలుపుకు అర్హత లేదు. 10 అయినా నేనేమిటో అది దేవుని కృప వల్లనే. నాకు ఆయన అనుగ్రహించిన కృప వృధాగా పోలేదు. ఎందుకంటే వారందరికంటే నేను ఎక్కువగా కష్టపడ్డాను. 11 నేనైనా వారైనా మేము ప్రకటించేది అదే, మీరు నమ్మినది అదే.
క్రీస్తు పునరుత్థానం ప్రాముఖ్యత
12 క్రీస్తు మరణించి సజీవుడై లేచాడని మేము ప్రకటిస్తూ ఉంటే మీలో కొందరు అసలు మృతుల పునరుత్థానమే లేదని ఎలా చెబుతారు? 13 మృతుల పునరుత్థానం లేకపోతే, క్రీస్తు కూడ లేవలేదు. 14 క్రీస్తు లేచి ఉండకపోతే మా సువార్త ప్రకటనా వ్యర్థం, మీ విశ్వాసమూ వ్యర్థం. 15 దేవుడు క్రీస్తును లేపాడని ఆయన గూర్చి మేము సాక్ష్యం చెప్పాం కదా? మృతులు లేవడం అనేది లేకపోతే దేవుడు యేసును కూడా లేపలేదు కాబట్టి మేము దేవుని విషయంలో అబద్ధ సాక్షులమన్నట్టే. 16 మృతులు లేవకపోతే క్రీస్తు కూడ లేవలేదు. 17 క్రీస్తు లేవకపోతే మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకా మీ పాపాల్లోనే ఉన్నారన్నమాట. 18 అంతేకాదు, ఇప్పటికే క్రీస్తులో కన్నుమూసిన వారు కూడా నశించినట్టే. 19 మనం ఈ జీవిత కాలం వరకే క్రీస్తులో ఆశ పెట్టుకొనే వారమైతే మనుషుల్లో మనకంటే నిర్భాగ్యులెవరూ ఉండరు.
పునరుత్థానాల క్రమం
20 కానీ ఇప్పుడు క్రీస్తు తిరిగి లేవడం ద్వారా చనిపోయిన వారిలో నుండి లేచిన వారిలో ప్రథమఫలం అయ్యాడు. 21 మనిషి ద్వారా మరణం వచ్చింది కాబట్టి మనిషి ద్వారానే చనిపోయిన వారు తిరిగి లేవడం జరిగింది. 22 ఆదాములో అందరూ ఏ విధంగా చనిపోతున్నారో, అదే విధంగా క్రీస్తులో అందరూ బ్రతికించబడతారు. 23 ప్రతి ఒక్కడూ తన తన వరుసలో బ్రతికించబడతారు. మొదట, అంటే ప్రథమ ఫలంగా క్రీస్తు, ఆ తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనకు చెందినవారు బ్రతికించబడతారు.
24 ఆ తరువాత ఆయన సమస్త ఆధిపత్యాన్నీ అధికారాన్నీ బలాన్నీ రద్దు చేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. అప్పుడు అంతం వస్తుంది. 25 ఎందుకంటే ఆయన శత్రువులంతా ఆయన పాదాక్రాంతులయ్యే వరకూ ఆయన పరిపాలించాలి. 26 చిట్ట చివరిగా నాశనమయ్యే శత్రువు మరణం. 27 దేవుడు సమస్తాన్నీ క్రీస్తు పాదాల కింద ఉంచాడు. సమస్తం అనే మాటలో పాదాల కింద ఉంచిన దేవుడు తప్ప మిగిలినవన్నీ ఆయన పాదాల కింద ఉన్నాయి అని తేటతెల్లం అవుతుంది కదా. 28 సమస్తమూ కుమారుడికి వశమైన తరువాత దేవుడు సర్వాధికారిగా ఉండే నిమిత్తం ఆయన కుమారుడు సమస్తాన్నీ తన కింద ఉంచిన దేవునికి తానే లోబడతాడు.
29 ఇదేమీ కాకపోతే చనిపోయిన వారి కోసం బాప్తిసం పొందేవారి సంగతేమిటి? చనిపోయినవారు లేవకపోతే వారి కోసం బాప్తిసం పొందడం ఎందుకు? 30 మేము గంటగంటకు ప్రాణం అరచేతిలో ఉంచుకుని బతకడం ఎందుకు?
31 సోదరులారా, మన ప్రభు క్రీస్తు యేసులో మిమ్మల్ని గూర్చి నేను చూపే అతిశయాన్ని బట్టి నేను ప్రకటించేది ఏమిటంటే, “నేను ప్రతి దినం చనిపోతున్నాను.” 32 నేను ఎఫెసులో క్రూర మృగాలతో పోరాడింది కేవలం మానవరీత్యా అయితే నాకు లాభమేముంది? చనిపోయిన వారు లేవకపోతే, “రేపు చనిపోతాం కాబట్టి తిని, తాగుదాం.” 33 మోసపోకండి. “దుష్టులతో సహవాసం మంచి నడతను చెడగొడుతుంది.” 34 కాబట్టి మేల్కోండి! నీతి ప్రవర్తన కలిగి, పాపం చేయకండి. మీలో కొందరికి దేవుని గూర్చిన అవగాహన లేదు. మీరు సిగ్గుపడాలని ఇలా చెబుతున్నాను.
పునరుత్థాన విధానం
35 అయితే “చనిపోయిన వారు ఎలా లేస్తారు? వారెలాటి శరీరంతో వస్తారు?” అని ఒకడు అడుగుతాడు. 36 బుద్ధి హీనుడా, నీవు విత్తనం వేసినప్పుడు అది ముందు చనిపోతేనే కదా, తిరిగి బతికేది! 37 నీవు పాతినది గోదుమ గింజైనా, మరి ఏ గింజైనా, వట్టి గింజనే పాతిపెడుతున్నావు గాని పైకి మొలిచే శరీరాన్ని కాదు. 38 దేవుడే తన ఇష్ట ప్రకారం నీవు పాతిన దానికి రూపాన్ని ఇస్తాడు. ప్రతి విత్తనానికీ దాని దాని శరీరాన్ని ఇస్తున్నాడు. 39 అన్ని రకాల మాంసాలు ఒక్కటి కాదు. మనిషి మాంసం వేరు, పశువు మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. 40 ఆకాశంలో వస్తువులున్నాయి, భూమి మీద వస్తువులున్నాయి. ఆకాశ వస్తు రూపాల మహిమ వేరు, భూవస్తు రూపాల మహిమ వేరు. 41 నూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల వెలుగు వేరు. ఒక నక్షత్రానికీ మరొక నక్షత్రానికీ వెలుగులో తేడా ఉంటుంది కదా.
42 చనిపోయిన వారు తిరిగి లేవడం కూడా అలాగే ఉంటుంది. నశించిపోయే శరీరాన్ని నాటి నశించని శరీరాన్ని పొందుతారు. 43 ఘనహీనంగా విత్తినది మహిమ గలదిగా, బలహీనంగా విత్తినది బలమైనదిగా తిరిగి లేస్తుంది. 44 ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తినది ఆత్మ సంబంధమైన శరీరంగా లేస్తుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. 45 దీని గురించి, “ఆదామనే మొదటి మనిషి జీవించే ప్రాణి అయ్యాడు” అని రాసి ఉంది. చివరి ఆదాము జీవింపజేసే ఆత్మ అయ్యాడు. 46 మొదట వచ్చింది ఆత్మ సంబంధమైనది కాదు. ముందు ప్రకృతి సంబంధమైనది, ఆ తరవాత ఆత్మ సంబంధమైనది వచ్చాయి. 47 మొదటి మనిషి భూసంబంధి. అతడు మట్టిలో నుండి రూపొందిన వాడు. రెండవ మనిషి పరలోకం నుండి వచ్చినవాడు. 48 మొదట మట్టి నుండి వచ్చినవాడు ఎలాటివాడో ఆ తరువాత మట్టి నుండి పుట్టిన వారంతా అలాంటివారే. పరలోక సంబంధి ఎలాటివాడో తరువాత వచ్చిన పరలోక సంబంధులు కూడా అలాటి వారే. 49 మనం మట్టి మనిషి పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను కూడా ధరిస్తాం. 50 సోదరులారా, నేను చెప్పేది ఏమంటే, రక్త మాంసాలు దేవుని రాజ్య వారసత్వం పొందలేవు. నశించి పోయేవి నశించని దానికి వారసత్వం పొందలేవు.
విశ్వాసుల్లో కొందరు చనిపోరు
1తెస్స 4:14-17
51 ఇదిగో వినండి, మీకు ఒక రహస్యం చెబుతున్నాను, మనమంతా నిద్రించం. నిమిషంలో రెప్ప పాటున, చివరి బాకా మోగగానే మనమంతా మారిపోతాం. 52 బాకా మోగుతుంది, అప్పుడు చనిపోయిన వారు నాశనం లేనివారుగా లేస్తారు. మనం మారిపోతాం. 53 నశించిపోయే ఈ శరీరం నాశనం లేని శరీరాన్ని ధరించుకోవాలి. మరణించే ఈ శరీరం మరణం లేని శరీరాన్ని ధరించుకోవాలి. 54 ఈ విధంగా నశించేది నశించని దానినీ, మరణించేది మరణం లేని దానినీ ధరించుకొన్నప్పుడు,
“విజయం మరణాన్ని మింగివేసింది”
అని రాసి ఉన్న మాటలు నెరవేరుతాయి.
55 “మరణమా, నీ విజయమేది? మరణమా, నీ ముల్లేది?”
56 మరణపు ముల్లు పాపం. పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే.
57 అయితే మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనకు విజయమిస్తున్న దేవునికి స్తుతి. 58 కాబట్టి నా ప్రియ సోదరులారా, స్థిరంగా, నిబ్బరంగా ఉండండి. మీ కష్టం ప్రభువులో వ్యర్థం కాదని ఎరిగి, ప్రభువు సేవలో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి.