3
ఆమోదం పొందిన పరిచర్య
1 మళ్ళీ మా గురించి మేము గొప్పలు చెప్పుకోవడం మొదలు పెట్టామా? కొంతమందికి అవసరమైనట్టు, మీకు గానీ, మీ నుండి గానీ పరిచయ లేఖలు మాకు అవసరమా? 2 మా పరిచయ లేఖ మీరే. ఈ లేఖ మా హృదయాల మీద రాసి ఉండగా, ప్రజలందరూ తెలుసుకుని చదువుకోగలుగుతున్నారు. 3 అది రాతి పలక మీద సిరాతో రాసింది కాదు. మెత్తని హృదయాలు అనే పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో, మా సేవ ద్వారా క్రీస్తు రాసిన ఉత్తరంగా మీరు కనబడుతున్నారు 4 క్రీస్తు ద్వారా దేవుని మీద మాకిలాంటి నమ్మకముంది. 5 మావల్ల ఏదైనా అవుతుందని ఆలోచించడానికి మేము సమర్థులమని కాదు. మా సామర్ధ్యం దేవుని నుండే కలిగింది.
ఈ పరిచర్య ఆత్మ సంబంధమైనది, మహిమగలది, ధర్మశాస్త్రపరమైనది కాదు
6 ఆయనే కొత్త ఒడంబడికకు సేవకులుగా మాకు అర్హత కలిగించాడు. అంటే వ్రాత రూపంలో ఉన్న దానికి కాదు, ఆత్మ మూలమైన దానికే. ఎందుకంటే అక్షరం చంపుతుంది గానీ ఆత్మ బ్రతికిస్తుంది. 7 మరణ కారణమైన సేవ, రాళ్ల మీద చెక్కిన అక్షరాలకు సంబంధించినదైనా, ఎంతో గొప్పగా ఉంది. అందుకే మోషే ముఖ ప్రకాశం తగ్గిపోతున్నా సరే, ఇశ్రాయేలీయులు అతని ముఖాన్ని నేరుగా చూడలేక పోయారు. 8 ఇలాగైతే ఆత్మ సంబంధమైన సేవ మరింకెంత గొప్పగా ఉంటుందో గదా!
9 శిక్షా విధికి కారణమైన సేవ ఇంత గొప్పగా ఉంటే, నీతికి కారణమైన సేవ మరింకెంతో గొప్పగా ఉంటుంది గదా! 10 అపారమైన వైభవం దీనికి ఉండడం వలన ఒకప్పుడు వైభవంగా ఉండేది, ఇప్పుడు వైభవం లేనిదయింది. 11 గతించి పోయేదే గొప్పగా ఉంటే, ఎప్పటికీ ఉండేది ఇంకా ఎక్కువ గొప్పగా ఉంటుంది గదా!
12 తగ్గిపోయే వైభవాన్ని ఇశ్రాయేలీయులు నేరుగా చూడకుండా మోషే తన ముఖం మీద ముసుకు వేసుకున్నాడు. మేము మోషేలాంటి వాళ్ళం కాదు 13 మాకెంతో భరోసా ఉంది కాబట్టి చాలా ధైర్యంగా ఉన్నాము. 14 అయితే వారి మనసులు మూసుకు పోయాయి. ఇప్పటి వరకూ వారు పాత ఒడంబడిక చదివేటప్పుడు ఆ ముసుకు అలానే ఉంది. ఎందుకంటే కేవలం క్రీస్తులో దేవుడు దాన్ని తీసివేశాడు. 15 అయితే ఇప్పటికీ వారు మోషే గ్రంథాన్ని చదివే ప్రతిసారీ వారి హృదయాల మీద ముసుకు ఇంకా ఉంది గాని 16 వారు ఎప్పుడు ప్రభువు వైపుకు తిరుగుతారో అప్పుడు దేవుడు ఆ ముసుకు తీసివేస్తాడు.
17 ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. 18 మనమంతా ముసుకు లేని ముఖాలతో ప్రభువు వైభవాన్ని చూస్తూ, అదే వైభవపు పోలిక లోకి క్రమక్రమంగా మారుతూ ఉన్నాము. ఇది ఆత్మ అయిన ప్రభువు ద్వారా జరుగుతున్నది.