7
హామాను పతనం
1 రాజు, హామాను రెండవ రోజు ఎస్తేరు రాణి దగ్గరికి విందుకు వచ్చారు. 2 రాజు “ఎస్తేరు రాణీ, నీ విన్నపం ఏమిటి? అది నెరవేరుస్తాను. నీ మనవి ఏమిటి? అర్థ రాజ్యమైనా సరే నీకు ఇస్తాను” అని ద్రాక్షారసం పోస్తూ ఉండగా ఎస్తేరుతో అన్నాడు.
3 అప్పుడు ఎస్తేరు రాణి ఇలా జవాబిచ్చింది “రాజా, నీ అనుగ్రహానికి నేను నోచుకుంటే రాజువైన తమకు అంగీకారం అయితే, నా ప్రాణం నిలిచేలా చేయండి. ఇదే నా నివేదన. నా జాతి ప్రజల ప్రాణాల విషయంలో కూడా నేను వేడుకుంటున్నాను. 4 నేను, నా జాతి ప్రజలు, సమూల నాశనానికి, సంహారానికి, తుడిచి పెట్టి వేయడానికి అమ్ముడుబోయాము. మేమంతా ఆడ, మగ బానిసలుగా అమ్ముడుబోయినట్టైతే నేను నోరు విప్పేదాన్ని కాదు. ఎందుకంటే ఆ మాత్రం ఇబ్బందికి రాజువైన మీకు బాధ ఇవ్వడం భావ్యం కాదు గదా.”
5 అందుకు రాజైన అహష్వేరోషు “వాడెవడు? ఈ పని చేయడానికి సాహసించిన వాడెక్కడ?” అని ఎస్తేరు రాణిని అడిగాడు. 6 ఎస్తేరు “మా విరోధి అయిన ఆ శత్రువు, దుష్టుడైన ఈ హామానే” అంది. అప్పుడు రాజు, రాణి ముందు హమానుకు ముచ్చెమటలు పోశాయి. 7 రాజు పట్టరాని కోపంతో ద్రాక్షారసం విందును విడిచి చరచరా అంతఃపురం తోటలోకి వెళ్ళాడు. అయితే రాజు తనను సర్వనాశనం చేసే ఆలోచన చేస్తున్నాడని హమాను భయపడ్డాడు. అతడు తన ప్రాణాలు కాపాడమని ఎస్తేరు రాణిని ప్రాధేయ పడసాగాడు.
8 అంతఃపురం తోటలోనుండి ద్రాక్షారసం విందు స్థలానికి రాజు తిరిగి వచ్చి ఎస్తేరు కూర్చున్న తల్పం మీద హామాను పడి ఉండడం చూశాడు. “వీడు నా ఇంట్లో నేను చూస్తుండగానే రాణిని బలాత్కారం చేస్తాడా?” అన్నాడు. ఆ మాట రాజు నోట రాగానే సైనికులు హామాను ముఖానికి ముసుకు వేశారు. 9 రాజు సముఖంలో ఉన్న అధికారుల్లో హర్బోనా అనే వాడు “అయ్యా, రాజు ప్రాణాలు కాపాడేందుకు మాట్లాడిన మొర్దెకైని ఉరి తీయాలని ఈ హామాను 50 మూరల ఎత్తున్న ఉరి కొయ్య ఒకటి చేయించాడు. అది హామాను ఇంటి దగ్గర ఉంది” అని చెప్పాడు. వెంటనే రాజు “దాని మీద వీడిని ఉరి తీయండి” అని ఆజ్ఞ ఇచ్చాడు.
10 ఆ విధంగా హామాను మొర్దెకై కోసం సిద్ధం చేసిన ఉరి కొయ్య మీద వాళ్ళు అతడినే ఉరి తీశారు. అప్పుడు రాజు ఆగ్రహం చల్లారింది.