3
దేవుని విశ్రాంతి (కుమారుడు క్రీస్తు సేవకుడైన మోషేకన్నా గొప్పవాడు)
కాబట్టి, పరలోక సంబంధమైన పిలుపులో భాగస్థులూ, పరిశుద్ధులూ అయిన సోదరులారా, మన ఒప్పుకోలుకు అపొస్తలుడూ, ప్రధాన యాజకుడూ అయిన యేసును గూర్చి ఆలోచించండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్టే ఈయన కూడా తనను నియమించిన దేవునికి నమ్మకంగా ఉన్నాడు. మోషే కంటే ఎక్కువ కీర్తి యశస్సులకు ఈయన యోగ్యుడిగా లెక్కలోకి వచ్చాడు. ఎందుకంటే నిర్మాణం అయిన ఇంటి కంటే దాన్ని నిర్మించిన వాడికే ఎక్కువ గౌరవం. ప్రతి ఇంటినీ ఎవరో ఒకరు నిర్మిస్తారు. కానీ సమస్తాన్నీ నిర్మించిన వాడు దేవుడే. దేవుడు భవిష్యత్తులో చెప్పే వాటికి సాక్షమివ్వడానికి మోషే ఒక సేవకుడిగా దేవుని ఇంట్లో నమ్మకమైనవాడుగా ఉన్నాడు. కానీ క్రీస్తు కుమారుడి యూదాలో దేవుని ఇంటి నిర్వాహకుడిగా ఉన్నాడు. మనకు కలిగిన ఆత్మనిబ్బరాన్నీ, ఆ నిబ్బరం వల్ల కలిగే అతిశయాన్నీ గట్టిగా పట్టుకుని ఉంటే మనమే ఆయన ఇల్లు.
హెచ్చరిక. ఈజిప్టు విడిచి వచ్చిన తరం అపనమ్మకం వల్లనే కనాను విశ్రాంతిలోకి ప్రవేశించలేక పోయారు
కాబట్టి పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా,
“ఈ రోజు మీరు ఆయన మాట విన్నట్టయితే
అరణ్యంలో శోధన ఎదురైనప్పుడు
తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయుల్లాగా
మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు.
నలభై సంవత్సరాలు నేను చేసిన గొప్ప కార్యాలన్నీ చూసినా
మీ పూర్వీకులు తిరుగుబాటు చేసి నన్ను పరీక్షించారు.
10 కాబట్టి ఆ తరం వారి వల్ల నేను అసంతృప్తి చెందాను.
కాబట్టి నేను కోపంతో ‘వీళ్ళు ఎప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోతున్నారు. నా మార్గాలు తెలుసుకోలేదు.
11 వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు’ అని కోపంగా శపథం చేశాను.”
12 సోదరులారా, సజీవుడైన దేవుని నుండి తొలగిపోయే హృదయం, అవిశ్వాసంతో నిండిన చెడ్డ హృదయం మీలో ఉండకుండాా జాగ్రత్త పడండి. 13 పాపపు వంచన వల్ల మీలో ఎవరూ కఠినులు కాకుండా ప్రతిరోజూ, ఈ రోజు అనే సమయం ఉండగానే ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. 14 ఎందుకంటే ప్రారంభం నుండి చివరి వరకూ ఆయనపై మనకున్న స్థిర విశ్వాసంపై ఆధారపడి ఉండటం వల్ల మనం క్రీస్తులో భాగస్వాములం అయ్యాం. 15 దీని గూర్చి మొదటే ఇలా చెప్పారు.
“ఈ రోజే మీరు ఆయన స్వరం వింటే,
ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసినట్టు
మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు.”
16 దేవుని మాట విని కూడా తిరుగుబాటు చేసిందెవరు? మోషే ఐగుప్తులో నుండి బయటకు నడిపించిన వారే కదా! 17 దేవుడు నలభై ఏళ్ళు ఎవరి మీద కోపపడ్డాడు? పాపం చేసిన వారి మీదే కదా! వారి మృతదేహాలు అరణ్యంలో రాలి పోయాయి. 18 తనకు అవిధేయులైన వారిని గూర్చి కాకుంటే తన విశ్రాంతిలో ప్రవేశించరని దేవుడు ఎవరిని ఉద్దేశించి ప్రమాణం చేశాడు? 19 దీన్నిబట్టి, అవిశ్వాసం మూలానే వారు ఆయన విశ్రాంతిలో ప్రవేశించలేక పోయారని మనం చూశాము.