4
దేవుని కరుణ మీద యోనా కోపం
కాని, ఇది యోనా దృష్టిలో చాలా తప్పుగా అనిపించింది. అతడు కోపంతో మండిపడ్డాడు. కాబట్టి యోనా యెహోవాను ఇలా ప్రార్ధించాడు. “నేను నా దేశంలో ఉన్నప్పుడు ఇలానే జరుగుతుందని చెప్పాను గదా! అందుకే నేనే మొదట తర్షీషుకు పారిపోడానికి ప్రయత్నించాను. ఎందుకంటే, నువ్వు కృపగల దేవుడివనీ, జాలిగల వాడివనీ, త్వరగా కోపగించే వాడివి కాదనీ, పూర్తిగా నమ్మదగిన వాడివనీ, నశింపజేయడానికి వెనుకంజ వేసేవాడివనీ నాకు తెలుసు. కాబట్టి, యెహోవా, ఇప్పుడు నా ప్రాణం తీసెయ్యమని బతిమాలుతున్నాను. ఎందుకంటే నేను బతకడం కంటే చావే మేలు.”
అందుకు యెహోవా “నువ్వు అంతగా కోపించడం న్యాయమా?” అని అడిగాడు. అప్పుడు యోనా ఆ పట్టణం నుంచి వెళ్లి దానికి తూర్పుగా ఒకచోట కూర్చున్నాడు. అక్కడ ఒక పందిరి వేసుకుని, పట్టణానికి ఏమి సంభవిస్తుందో చూద్దామని, ఆ పందిరి నీడలో కూర్చున్నాడు.
యెహోవా దేవుడు ఒక మొక్కను సిద్ధం చేసి, అతనికి కలిగిన బాధ పోగొట్టడానికి, అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చేలా చేశాడు. ఆ మొక్కను బట్టి యోనా చాలా సంతోషించాడు. మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగును సిద్ధంచేసి ఉంచాడు. అది ఆ మొక్కను పాడు చేయగా అది వాడిపోయింది.
ఆ తరువాత రోజు సూర్యోదయం అయినప్పుడు, దేవుడు తూర్పునుండి వీచే వడగాలిని సిద్ధం చేశాడు. యోనాకు ఎండ దెబ్బ తగిలి సొమ్మసిల్లిపోయాడు. “బతకడం కంటే చావడమే నాకు మేలు” అని తనలో తాను అనుకున్నాడు. అప్పుడు దేవుడు యోనాతో “ఈ మొక్క గురించి నువ్వు అంతగా కోపపడడం భావ్యమేనా?” అన్నాడు. యోనా “చచ్చి పోయేటంతగా కోపపడడం భావ్యమే” అన్నాడు.
10 అందుకు యెహోవా “నువ్వేమాత్రం కష్టపడకుండా, పెంచకుండా దానికదే పెరిగిన మొక్క మీద నువ్వు జాలిపడుతున్నావే. అది ఒక రాత్రిలోనే పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయింది. 11 అయితే నీనెవె మహా పట్టణంలో కుడి ఎడమలు తెలియని లక్షా ఇరవై వేల కంటే ఎక్కువమంది ప్రజలున్నారు. చాలా పశువులు కూడా ఉన్నాయి. దాని గురించి నేను జాలిపడవద్దా?” అని అతనితో అన్నాడు.