22
తూర్పు గోత్రికులు స్వస్థలానికి తిరిగి రావడం
1 యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రపు వారిని పిలిపించి వారితో ఇలా అన్నాడు, 2 “యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతా మీరు చేశారు. నేను మీ కాజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విన్నారు. 3 ఇన్నిరోజులనుండి ఇప్పటి వరకూ మీరు మీ సోదరులను విడిచిపెట్టకుండా మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. 4 ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సోదరులకు వాగ్దానం చేసిన ప్రకారం వారికి నెమ్మది కలగజేశాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడు మోషే, యొర్దాను అవతల మీకు స్వాస్థ్యంగా ఇచ్చిన ప్రాంతంలోని మీ నివాసాలకు తిరిగి వెళ్ళండి. 5 అయితే మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ, ఆయన మార్గాలన్నిటిలో నడుస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయనను హత్తుకుని సేవిస్తూ, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోండి.” 6 అతడిలా చెప్పి వారిని దీవించి పంపివేశాడు. తరువాత వారు తమ నివాసాలకు వెళ్ళిపోయారు.
7 మోషే బాషానులో మనష్షే అర్థగోత్రానికీ యెహోషువ పడమరగా యొర్దాను ఇవతల వారి సోదరుల్లో మిగిలిన అర్థగోత్రానికీ స్వాస్థ్యం ఇచ్చారు. యెహోషువ వారి నివాసాలకు వారిని పంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇలా అన్నాడు, 8 “మీరు చాలా ధనంతో అతి విస్తారమైన పశువులూ వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, అతి విస్తారమైన వస్త్రాలతో మీ నివాసాలకు తిరిగి వెళ్తున్నారు. మీ శత్రువుల దగ్గర దోచుకున్న సొమ్మును మీరు, మీ సోదరులు కలిసి పంచుకోండి.”
9 కాబట్టి రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థ గోత్రపువారు యెహోవా మోషేద్వారా సెలవిచ్చిన మాట ప్రకారం తాము స్వాధీనపరచుకున్న స్వాస్థ్యభూమి అయిన గిలాదుకు వెళ్లడానికి కనాను ప్రాంతంలోని షిలోహులోని ఇశ్రాయేలీయుల దగ్గర నుండి బయలుదేరారు. కనాను ప్రాంతంలో ఉన్న యొర్దాను ప్రదేశానికి వచ్చినప్పుడు 10 రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థ గోత్రపు వారు అక్కడ యొర్దాను నది దగ్గర ఒక బలిపీఠం కట్టారు. అది చూడడానికి గొప్ప బలిపీఠమే.
11 అప్పుడు రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రపు వారు ఇశ్రాయేలీయుల సరిహద్దు దగ్గర యొర్దాను ప్రదేశంలో కనాను ప్రాంతం ఎదురుగా బలిపీఠం కట్టారని ఇశ్రాయేలీయులకు సమాచారం వచ్చింది. 12 ఇశ్రాయేలీయులు ఆ మాట విన్నప్పుడు సమాజమంతా వారితో యుధ్ధం చేయడానికి షిలోహులో పోగయ్యారు.
13 ఇశ్రాయేలీయులు గిలాదులో ఉన్న రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థ గోత్రపువారి దగ్గరికి యాజకుడు ఎలియాజరు కుమారుడు ఫీనెహాసును పంపించారు. 14 అతనితో ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో ప్రతిదానికీ ఒకరి చొప్పున పదిమంది ప్రముఖులను పంపించారు. వారంతా ఇశ్రాయేలీయులకు ప్రతినిధులు, తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులు.
15 వారు గిలాదు ప్రాంతంలో ఉన్న రూబేను, గాదు, మనష్షే అర్థ గోత్రం వారితో ఇలా అన్నారు, 16 “యెహోవా సర్వసమాజం వారు ఇలా అంటున్నారు, ‘ఈ రోజు యెహోవాను అనుసరించడం మాని, మీ కోసం బలిపీఠం కట్టుకుని ఇశ్రాయేలీయుల దేవుని మీద మీరెందుకు తిరుగుబాటు చేస్తున్నారు? 17 పెయోరు పర్వతంలో మనం చేసిన దోషం మనకు సరిపోదా?* 22:17 సంఖ్య 25:1-9, కీర్తన 106:28 చూడండి దానివల్ల యెహోవా సమాజంలో తెగులు పుట్టింది. ఇంకా మనం దానినుండి శుద్ధులం కాలేదు. 18 ఈ రోజు మీరు కూడా యెహోవాను అనుసరించడం మానివేస్తారా? మీరు కూడా ఈ రోజు యెహోవా మీద తిరుగుబాటు చేస్తే రేపు ఆయన ఇశ్రాయేలు సమాజమంతటి మీదా కోపిస్తాడు. 19 మీ స్వాధీనమైన ప్రదేశం అపవిత్రమైనది అయితే యెహోవా ప్రత్యక్షపు గుడారం ఉండే ప్రదేశానికి వచ్చి మా మధ్య స్వాస్థ్యం తీసుకోండి. మన దేవుడైన యెహోవా బలిపీఠం గాక వేరొక బలిపీఠం కట్టి యెహోవా మీదా, మామీదా తిరగబడవద్దు. 20 జెరహు కుమారుడు ఆకాను ప్రతిష్ఠితమైన దానివిషయంలో ద్రోహం చేసినందు వలన ఇశ్రాయేలీయుల సమాజమంతటి మీదికి ఉగ్రత రాలేదా?† 22:20 7:1-26 చూడండి తన దోషానికి అతడొక్కడే నాశనం కాలేదు కదా.’ ”
21 అప్పుడు రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రం వారు ఇశ్రాయేలీయుల కుటుంబాల నాయకులకు ఇలా జవాబిచ్చారు, 22 “యెహోవాయే గొప్ప దేవుడు! యెహోవాయే గొప్ప దేవుడు! ఆ సంగతి ఆయనకు తెలుసు, ఇశ్రాయేలీయులు కూడా తెలుసుకోవాలి. ద్రోహం చేతగానీ యెహోవా మీద తిరుగుబాటు చేతగానీ మేము ఈ పని చేసి ఉంటే ఈ రోజున మమ్మల్ని బతకనివ్వవద్దు. 23 యెహోవాను అనుసరించకుండా దహనబలి గానీ నైవేద్యం గానీ సమాధాన బలులు గానీ దానిమీద అర్పించడానికి మేము ఈ బలిపీఠాన్ని కట్టి ఉంటే యెహోవాయే మమ్మల్ని శిక్షిస్తాడు గాక! 24 రాబోయే కాలంలో మీ పిల్లలు మా పిల్లలతో, ‘ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధం? 25 మీకు మాకు మధ్య యెహోవా యొర్దాను నదిని సరిహద్దుగా చేశాడు. రూబేనీయులారా, గాదీయులారా, మీకు యెహోవాతో సంబంధం లేదు’ అంటారేమో అని భయపడి మేమిలా చేశాం. మీ పిల్లలు మా పిల్లలను యెహోవాను సేవించకుండా చేస్తారేమో. 26 కాబట్టి మేము, ‘మనం బలిపీఠం కట్టుకుందాం. అది దహనబలులకూ మరి ఎలాటి బలులకూ కాదు. 27 మన దహనబలులూ బలులతో సమాధాన బలులతో మనం యెహోవాకు సేవచేయాలనీ, యెహోవా దగ్గర మీకు పాలు ఏదీ లేదు అనే మాట మీ పిల్లలు మా పిల్లలతో ఎన్నడూ చెప్పకుండా అది మాకు మీకు, మన తరవాతి తరాల వారి మధ్య సాక్షిగా ఉంటుంది’ అనుకున్నాము.”
28 “కాబట్టి ఇక మీదట వారు మాతో గాని మా సంతానంతో గాని అలా అంటే, మేము ‘మన పూర్వీకులు చేసిన బలిపీఠపు ఆకారం చూడండి, ఇది దహనబలులూ, బలి అర్పణలూ అర్పించడానికి కాదు, మాకు మీకు మధ్య సాక్షిగా ఉండడానికే’ అని చెప్పాలని అనుకున్నాం. 29 మన దేవుడైన యెహోవా ప్రత్యక్షపు గుడారం ఎదురుగా ఉన్న ఆయన బలిపీఠం తప్ప దహనబలులకు గానీ నైవేద్యాలకు గానీ బలులకు గానీ వేరొక బలిపీఠాన్ని కట్టి, ఈ రోజు యెహోవాను అనుసరించకుండా తొలగిపోయి ఆయన మీద తిరగబడడం మాకు దూరమవుతుంది గాక.”
30 రూబేనీయులు, గాదీయులు, మనష్షీయులు చెప్పిన మాటలు యాజకుడైన ఫీనెహాసు, ప్రజల నాయకులు, అంటే అతనితో ఉన్న ఇశ్రాయేలీయుల పెద్దలు విని సంతోషించారు. 31 అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు, రూబేనీయులతో గాదీయులతో మనష్షీయులతో “మీరు యెహోవాకు విరోధంగా ఈ ద్రోహం చేయలేదు కాబట్టి యెహోవా మన మధ్య ఉన్నాడని ఈ రోజు తెలుసుకున్నాం. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించారు” అని చెప్పాడు.
32 అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు, ఆ నాయకులూ గిలాదులోని రూబేను, గాదు గోత్రాల నుండి ఇశ్రాయేలీయుల దగ్గరికి తిరిగి వచ్చి ప్రజలకు ఆ మాట తెలియచేశారు. 33 అది విని ఇశ్రాయేలీయులు సంతోషించారు. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించి, రూబేనీయులు గాదీయులు నివసించే ప్రదేశాన్ని పాడు చేయకుండా వారి మీద యుధ్ధం చేయడం ఆపేశారు. 34 రూబేనీయులు, గాదీయులు “యెహోవాయే దేవుడు అనడానికి ఆ బలిపీఠం మన మధ్య సాక్షి” అని చెప్పి దానికి “సాక్షి‡ 22:34 సాక్షి ఎద ” అనే పేరు పెట్టారు.