8
నాలుగు వేల మందికి ఆహారం
మత్తయి 15:32-39
1 ఆ రోజుల్లో ఒకసారి పెద్ద జనసమూహం గుమిగూడారు. వారి దగ్గర తినడానికి ఏమీ లేకపోయింది. యేసు తన శిష్యులను పిలిచి, 2 “ఈ ప్రజల మీద నాకు జాలి కలుగుతున్నది. వారు ఇప్పటికే మూడు రోజుల నుండి నా దగ్గర ఉన్నారు. తినడానికి వారి దగ్గర ఏమీ లేదు. 3 వారిని ఇప్పుడు పంపివేస్తే వారిలో కొందరు చాలా దూరం నుండి వచ్చారుగనక దారిలో సొమ్మసిల్లి పోవచ్చు” అని అన్నాడు. 4 ఆయన శిష్యులు, “ఈ నిర్జన ప్రాంతంలో ఇంతమందికి సరిపడినంత ఆహారం ఎక్కడ నుండి తేగలం?” అన్నారు.
5 “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి?” అని ఆయన వారిని అడిగాడు. వారు, “ఏడు” అన్నారు. 6 యేసు ఆ ప్రజలందరినీ నేల మీద కూర్చోమని ఆజ్ఞాపించాడు. ఆ ఏడు రొట్టెలను చేతపట్టుకుని దేవునికి కృతజ్ఞత చెప్పి వాటిని విరిచి శిష్యులకిచ్చి వారికి పంచమన్నాడు. శిష్యులు అలాగే చేశారు. 7 వారి దగ్గర కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి. యేసు వాటి కోసం కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి, వాటిని కూడా పంచమని శిష్యులకు ఇచ్చాడు.
8 ఆ ప్రజలంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను ఏడు పెద్ద గంపల నిండా నింపారు. 9 తిన్నవారు సుమారు నాలుగు వేలమంది పురుషులు. యేసు వారిని పంపివేసి, 10 వెంటనే తన శిష్యులతో కలసి, పడవ ఎక్కి దల్మనూతా ప్రాంతానికి వెళ్ళాడు.
పరిసయ్యులు సూచనకై అడగడం, పులిపిండి వివరణ
మత్తయి 16:1-12
11 పరిసయ్యులు వచ్చి యేసుతో వాదించడం మొదలుపెట్టారు. ఆయనను పరీక్షించడం కోసం తమకు ఆకాశం నుండి ఒక సూచన చూపమని అడిగారు. 12 దానికి ఆయన ఆత్మలో పెద్దగా నిట్టూర్చి, “ఈ తరం వారు ఎందుకు సూచక క్రియలను చూపమని అడుగుతున్నారు? మీతో కచ్చితంగా చెప్తున్నాను, ఈ తరానికి ఏ సూచనా చూపడం జరగదు” అని వారితో చెప్పాడు. 13 తరువాత ఆయన వారిని విడిచిపెట్టి, మళ్ళీ పడవ ఎక్కి అవతలి ఒడ్డు చేరుకున్నాడు.
14 శిష్యులు తమతో రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు. వారి దగ్గర పడవలో ఒక రొట్టె తప్ప ఏమీ లేదు. 15 యేసు వారితో, “పరిసయ్యులకు, హేరోదుకు సంబంధించిన పొంగజేసే పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి!” అన్నాడు.
16 శిష్యులు, “మన దగ్గర రొట్టెలు లేవని అలా అంటున్నాడా?” అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. 17 అది కనిపెట్టి యేసు, “రొట్టెలు లేవనే విషయం ఎందుకు చర్చించుకుంటున్నారు? మీకు ఇంకా అర్థం కాలేదా? మీరు గ్రహించలేదా? మీ బుద్ధి మందగించిందా? 18 మీరు కళ్ళుండి కూడా చూడరా? చెవులుండి కూడా వినరా? మీకు గుర్తు లేదా? 19 ఐదు రొట్టెలు విరిచి ఐదు వేల మందికి నేను పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని పెద్ద గంపలు నింపారు?” అని అడిగాడు. వారు, “పన్నెండు” అని జవాబు చెప్పారు. 20 “మరి ఏడు రొట్టెలు విరిచి నాలుగు వేల మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కలను ఎన్ని పెద్ద గంపలు నింపారు?” అని అడిగినప్పుడు వారు, “ఏడు” అని జవాబు చెప్పారు. 21 ఆయన వారితో, “ఇంకా మీకు అర్థం కాలేదా?” అన్నాడు.
బేత్సయిదా వద్ద గుడ్డి వాడికి చూపు
22 యేసు, ఆయన శిష్యులు బేత్సయిదాకు వచ్చారు. కొందరు ఒక గుడ్డివాణ్ణి యేసు దగ్గరికి తీసుకు వచ్చారు. అతని మీద చెయ్యి ఉంచమని వేడుకున్నారు. 23 యేసు ఆ గుడ్డివాడి చెయ్యి పట్టుకుని ఊరి బయటకు తీసుకు వెళ్ళాడు. అతని కళ్ళ మీద ఉమ్మివేసి, అతని మీద చేతులుంచి, “నీకు ఏమైనా కనిపిస్తుందా?” అన్నాడు. 24 ఆ గుడ్డివాడు పైకి చూస్తూ, “మనుషులు నడుస్తున్న చెట్ల లాగా కనిపిస్తున్నారు” అన్నాడు. 25 అప్పుడు ఆయన మళ్ళీ అతని కళ్ళపై తన చేతులుంచాడు. అప్పుడా మనిషి కళ్ళు తెరుచుకుని బాగుపడి అన్నిటినీ స్పష్టంగా చూడగలిగాడు. 26 యేసు అతనిని పంపివేస్తూ, “నీవు ఊరిలోకి వెళ్ళవద్దు” అని అతనితో చెప్పాడు.
పేతురు విశ్వాస ప్రమాణం
మత్తయి 16:13-16; లూకా 9:18-20
27 యేసు ఆయన శిష్యులతో కలిసి ఫిలిప్పు కైసరయ పట్టణం చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్ళాడు. దారిలో ఆయన, “నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు? అని తన శిష్యులను అడిగాడు. 28 అందుకు వారు, “బాప్తిసం ఇచ్చే యోహానని కొందరూ, ఏలీయా అని కొందరూ, ప్రవక్తల్లో ఒకడు అని కొందరూ అంటున్నారు” అని చెప్పారు. 29 “అయితే మీరు నేనెవరినని అనుకుంటున్నారు?” అని ఆయన వారిని అడిగాడు. దానికి జవాబుగా పేతురు, “నీవు అభిషిక్తుడివి!” అన్నాడు. 30 అప్పుడు ఆయన తనను గురించి ఎవ్వరికీ చెప్పవద్దని వారిని హెచ్చరించాడు.
31 ఆ తరువాత యేసు వారితో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు, “మనుష్య కుమారుడు ఎన్నో కష్టాలు భరిస్తాడు. పెద్దలు, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులచే ఆయన తృణీకారానికి గురై మరణమౌతాడు. ఆయన మూడు రోజుల తరువాత సజీవంగా బ్రతికి వస్తాడు.”
32 యేసు ఈ విషయం చాలా స్పష్టంగానే చెప్పాడు. అయితే పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, పక్కకు తీసుకు వెళ్ళి ఆయనను మందలించ సాగాడు. 33 కాని యేసు వెనక్కి తిరిగి తన శిష్యులను చూసి పేతురుతో, “సైతానూ! నా వెనక్కి పో! మనుషుల సంగతుల పైనే గాని దేవుని సంగతుల మీద నీకు మనసు లేదు” అని గద్దించాడు.
ప్రాణం విలువ
మత్తయి 16:24-27; లూకా 23-26
34 తరువాత యేసు తన శిష్యులను, ప్రజలను దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు. “ఎవరైనా నా వెంట రావాలనుకుంటే తనను తాను కాదనుకుని, తన సిలువను మోసుకుంటూ నాతో నడవాలి. 35 ఎందుకంటే తన ప్రాణాన్ని దక్కించుకోవాలని చూసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని నా కోసం, సువార్త కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడు. 36 ఒక మనిషి ప్రపంచమంతా సంపాదించి, తన ప్రాణాన్నే పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి ఏం లాభం? 37 ఒకడు తన ప్రాణాన్ని తిరిగి పొందడానికి ఏమి ఇవ్వగలడు?
38 వ్యభిచారం, పాపం జరిగించే ఈ తరంలో ఎవరైనా నా గురించీ నా మాటల గురించీ సిగ్గుపడితే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో, పవిత్ర దేవదూతలతో కలసి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి విషయంలో సిగ్గుపడతాడు.”