25
మోయాబులు దగ్గర ఇశ్రాయేలీయుల పాపం
ఇశ్రాయేలీయులు షిత్తీములో ఉన్నప్పుడు ప్రజలు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చెయ్యడం మొదలు పెట్టారు. ఆ స్త్రీలు తమ దేవుళ్ళ బలులకు ప్రజలను ఆహ్వానించినప్పుడు వీరు భోజనం చేసి వారి దేవుళ్ళకు నమస్కారం చేశారు. ఇశ్రాయేలీయులు బయల్పెయోరును ఆరాధించిన కారణంగా యెహోవా కోపం వారి మీద రగులుకుంది.
అప్పుడు యెహోవా మోషేతో “నువ్వు ప్రజల నాయకులందర్నీ చంపి, నా ఎదుట, * 25:4 యెహోవా ఎదుట, అందరూ చూసేలా.పట్టపగలు వారిని వేలాడదియ్యి. అప్పుడు నా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుంచి తొలిగి పోతుంది” అని చెప్పాడు. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల నాయకులతో “మీలో ప్రతివాడూ, బయల్పెయోరును ఆరాధించే వారితో కలిసిన వారిని చంపాలి” అన్నాడు.
అప్పుడు మోషే కళ్ళ ఎదుట, సన్నిధి గుడారం ద్వారం దగ్గర, ఏడుస్తూ ఉన్న ఇశ్రాయేలీయుల సమాజం అంతటి కళ్ళ ఎదుట, ఇశ్రాయేలీయుల్లో ఒకడు తన కుటుంబికుల మధ్యకు ఒక మిద్యాను స్త్రీని తీసుకొచ్చాడు. యాజకుడైన అహరోను మనవడు, ఎలియాజరు కొడుకు ఫీనెహాసు అది చూసి, సమాజం నుంచి లేచి, ఈటె చేత్తో పట్టుకుని ఆ ఇశ్రాయేలీయుడి వెంట ఆ గుడారంలోకి వెళ్లి ఆ ఇద్దరినీ, అంటే ఆ ఇశ్రాయేలీయుణ్ణీ, ఆ స్త్రీనీ, కడుపులో గుండా దూసుకు పోయేలా పొడిచాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల్లోకి దేవుడు పంపించిన తెగులు ఆగిపోయింది. ఆ తెగులు వల్ల 24 వేల మంది చనిపోయారు.
10 అప్పుడు యెహోవా మోషేతో “యాజకుడైన అహరోను మనవడూ, ఎలియాజరు కొడుకూ అయిన ఫీనెహాసు, 11 వారి మధ్య నేను సహించలేనిదాన్ని తానూ సహించకపోవడం వల్ల ఇశ్రాయేలీయుల మీద నుంచి నా కోపం మళ్ళించాడు గనక నేను సహించలేకపోయినా ఇశ్రాయేలీయులను నాశనం చెయ్యలేదు.
12 కాబట్టి నువ్వు అతనితో ఇలా అను, చూడు, నేను ఫినెహాసుకు నా సమాధాన నిబంధన చేస్తున్నాను. 13 అది శాశ్వతమైన యాజక నిబంధనగా అతనికీ, అతని సంతానానికీ ఉంటుంది. ఎందుకంటే అతడు తన దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వాడుగా ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు” అన్నాడు.
14 ఫినెహాసు చంపినవాడి పేరు జిమ్రీ. అతడు షిమ్యోనీయుల్లో తన పితరుల వంశానికి నాయకుడైన సాలూ కొడుకు. 15 ఫినెహాసు చంపిన స్త్రీ పేరు కొజ్బీ, ఆమె సూరు కూతురు. అతడు మిద్యానీయుల్లో ఒక గోత్రానికీ, కుటుంబానికీ నాయకుడు.
16 ఇంకా యెహోవా మోషేతో “మిద్యానీయులను శత్రువులుగా భావించి వారి మీద దాడి చెయ్యండి. 17 వారు మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని శత్రువులుగా ఎంచారు. 18 పెయోరు విషయంలో, తెగులు రోజున చంపిన తమ సహోదరి, మిద్యాను నాయకుని కూతురు కొజ్బీ విషయంలో, మిమ్మల్ని దుర్మార్గంలోకి నడిపించారు.”

*25:4 25:4 యెహోవా ఎదుట, అందరూ చూసేలా.