135
యెహోవా సేవకులారా, యెహోవాను స్తుతించండి. ఆయన నామాన్ని కీర్తించండి.
యెహోవా మందిరంలో, మన దేవుని మందిరపు ఆవరణంలో నిలబడే వాళ్ళంతా యెహోవాను స్తుతించండి.
యెహోవా మంచి వాడు. ఆయనను స్తుతించండి. ఆయన నామాన్ని కీర్తించడం అత్యంత మనోహరం!
యెహోవా తన కోసం యాకోబును ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజను తన ఆస్తిగా ఏర్పాటు చేసుకున్నాడు.
యెహోవా గొప్పవాడని నాకు తెలుసు. దేవుళ్ళని పిలిచే వాళ్ళందరికంటే మన ప్రభువు గొప్పవాడు.
భూమి పైన, ఆకాశంలో, సముద్రాల్లో, అగాధ సముద్రాల్లో ఆయన ఏమనుకుంటే అది చేస్తాడు.
భూమి అంచుల నుంచి ఆయన మేఘాలను రప్పిస్తాడు. వర్షంతో బాటు ఆకాశంలో మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగిలోనుంచి గాలిని బయటికి తెస్తాడు.
ఈజిప్టు ప్రజల తొలిచూలు సంతానాన్ని, పశువుల తొలి సంతతిని ఆయన హతం చేశాడు.
ఐగుప్తూ, నీ మధ్య ఆయన సూచకక్రియలు, అద్భుతాలు కనపరచాడు. ఫరోకు, అతని పరివారానికీ వ్యతిరేకంగా వాటిని చేశాడు.
10 ఆయన అనేక జాతులపై దాడి చేసాడు. బలిష్టులైన రాజులను ఆయన హతం చేశాడు.
11 అమోరీయుల రాజు సీహోనును, బాషాను రాజు ఓగును కనాను రాజ్యాలన్నిటినీ నేలమట్టం చేశాడు.
12 ఆయన వాళ్ళ దేశాలను స్వాస్థ్యంగా, తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇచ్చాడు.
13 యెహోవా, నీ నామం శాశ్వతంగా నిలుస్తుంది. యెహోవా, నిన్ను గూర్చిన జ్ఞాపకం తరతరాలకు నిలిచి ఉంటుంది.
14 యెహోవా తన ప్రజల పక్షంగా నిలబడతాడు. అయితే తన సేవకుల విషయం కనికరం చూపిస్తాడు.
15 ఇతర ప్రజల దేవుళ్ళు మనుషులు తమ చేతులతో తయారు చేసిన వెండి, బంగారం విగ్రహాలు.
16 వాటికి నోళ్ళు ఉన్నప్పటికీ మాట్లాడవు. కళ్ళు ఉన్నా చూడలేవు.
17 వాటికి చెవులు ఉన్నాయి గానీ వినలేవు. వాటికి నోట్లో ఊపిరి లేదు.
18 వాటిని తయారు చేసేవాళ్ళు, వాటిపై నమ్మకముంచి పూజించే వాళ్లంతా వాటిలాగే అవుతారు.
19 ఇశ్రాయేలు వంశానికి చెందిన ప్రజలారా, యెహోవాను కీర్తించండి. అహరోను వంశస్థులందరూ యెహోవాను స్తుతించండి.
20 లేవి వంశస్థులందరూ యెహోవాను స్తుతించండి. యెహోవా అంటే భయభక్తులు ఉన్నవాళ్ళంతా యెహోవాను కీర్తించండి.
21 యెరూషలేములో నివసించే యెహోవాకు సీయోనులో స్తుతి కలుగు గాక. యెహోవాను స్తుతించండి.