4
విశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం-ఉదాహరణ సహిత వివరణ
1 కాబట్టి శరీరరీతిగా మన పూర్వికుడైన అబ్రాహాముకు ఏం దొరికింది? 2 అబ్రాహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్పు పొంది ఉంటే అతడు గొప్పలు పోవడానికి కారణం ఉండేది గానీ అది దేవుని ఎదుట కాదు. 3 లేఖనం చెబుతున్నదేమిటి? “అబ్రాహాము దేవునిలో నమ్మకముంచాడు. దాని ద్వారానే అతడు నీతిమంతుడని తీర్పు పొందాడు.” 4 పని చేసే వ్యక్తికి ఇచ్చే జీతం అతనికి హక్కుగా రావలసిన సొమ్మే గాని దానం కాదు.
విశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం-నిర్వచనం
4:18-21
5 కానీ క్రియలు చేయకుండా దానికి బదులు భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చే దేవునిలో కేవలం విశ్వాసం ఉంచే వ్యక్తి విశ్వాసాన్నే దేవుడు నీతిగా ఎంచుతాడు. 6 అదే విధంగా క్రియలు లేకుండా దేవుడు నీతిమంతుడుగా ప్రకటించిన మనిషి ధన్యుడని దావీదు కూడా చెబుతున్నాడు. 7 ఎలా అంటే,
“తన అతిక్రమాలకు క్షమాపణ పొందినవాడు,
తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు.
8 ప్రభువు ఎవరి అపరాధం లెక్కలోకి తీసుకోడో వాడు ధన్యుడు.”
విశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం-ధర్మశాస్త్ర విధులకు భిన్నమైనది
9 ఈ దీవెన సున్నతి ఆచరించే వారి గురించి చెప్పాడా, ఆచరించని వారి గురించి కూడా చెప్పాడా? అబ్రాహాము విశ్వాసం అతణ్ణి నీతిమంతుడుగా తీర్చింది అన్నాం కదా? 10 అతడు ఏ స్థితిలో ఉన్నప్పుడు అది జరిగింది? సున్నతి చేయించుకున్న తరవాతా లేక సున్నతికి ముందా? ముందే కదా! 11 సున్నతి లేకపోయినా నమ్మిన వారికందరికీ అతడు తండ్రి కావడం కోసం వారికి నీతి ఆపాదించడానికై సున్నతి లేనప్పుడే, తాను కలిగి ఉన్న విశ్వాసం వలన పొందిన నీతికి ముద్రగా సున్నతి అనే గుర్తును పొందాడు. 12 అలాగే సున్నతి గలవారికి కూడా తండ్రి కావడానికి, అంటే కేవలం సున్నతి మాత్రమే పొందిన వారు కాక సున్నతి లేనప్పుడు మన తండ్రి అబ్రాహాము విశ్వాసపు అడుగుజాడల్లో నడచిన వారికి కూడా తండ్రి కావడానికి అతడు ఆ గుర్తు పొందాడు.
విశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం-ధర్మశాస్త్రానికి భిన్నమైనది
13 అబ్రాహాము, అతని సంతానం లోకానికి వారసులవుతారు అనే వాగ్దానం ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు. విశ్వాసం వలన ఏర్పడిన నీతి మూలంగానే కలిగింది. 14 ధర్మశాస్త్ర సంబంధులు వారసులైతే విశ్వాసం వ్యర్థమౌతుంది, వాగ్దానం కూడా నిరర్థకమౌతుంది. 15 ఎందుకంటే ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టిస్తుంది. ధర్మశాస్త్రం లేని చోట దాన్ని అతిక్రమించడం కూడా ఉండదు.
16 ఈ కారణం చేత ఆ వాగ్దానం అబ్రాహాము సంతతి వారందరికీ, అంటే ధర్మశాస్త్రం గలవారికి మాత్రమే కాక అబ్రాహాముకున్న విశ్వాసం గలవారికి కూడా కృపను బట్టి వర్తించాలని, అది విశ్వాసమూలమైనది అయ్యింది. ఆ అబ్రాహాము మనందరికీ తండ్రి. 17 దీని గురించే, “నిన్ను అనేక జనాలకు తండ్రిగా నియమించాను” అని రాసి ఉంది. తాను నమ్ముకున్న దేవుని సమక్షంలో, అంటే చనిపోయిన వారిని బతికించేవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు అయిన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి. 18 అలాగే, “నీ సంతానం ఇలా ఉంటుంది” అని రాసి ఉన్నట్టుగా తాను అనేక జనాలకు తండ్రి అయ్యేలా ఎలాటి ఆశాభావం లేనప్పడు సైతం అతడు ఆశాభావంతో నమ్మాడు. 19 అతడు విశ్వాసంలో బలహీనుడు కాలేదు, సుమారు నూరు సంవత్సరాల వయస్సు గలవాడు కాబట్టి, తన శరీరాన్ని మృతతుల్యంగా, శారా గర్భం మృతతుల్యంగా భావించాడు. 20 అవిశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని గూర్చి సందేహించక విశ్వాసంలో బలపడి దేవుణ్ణి మహిమ పరచాడు. 21 దేవుడు మాట ఇచ్చిన దాన్ని ఆయన నెరవేర్చడానికి సమర్థుడని గట్టిగా నమ్మాడు. 22 అందుచేత దేవుడు దాన్ని అతనికి నీతిగా ఎంచాడు. 23 దేవుడు ఆ విశ్వాసాన్ని ఆ విధంగా ఎంచాడని అతని కోసం మాత్రమే రాసి లేదు, 24 మన ప్రభు యేసును చనిపోయిన వారిలో నుండి లేపిన దేవునిలో విశ్వాసం ఉంచిన మనలను కూడా నీతిమంతులుగా ఎంచడానికి మన కోసం కూడా రాసి ఉంది. 25 ఆయనను దేవుడు మన అపరాధాల కోసం అప్పగించి, మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయనను తిరిగి లేపాడు.