8
మాంసాహారం, క్రైస్తవ స్వేచ్ఛ పరిథి
ఇప్పుడిక గ్రహాలకు బలి అర్పించిన వాటి విషయం: మనమంతా తెలివైన వారమే అని మనకి తెలుసు. తెలివి మిడిసిపడేలా చేస్తుంది గాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. ఎవరైనా తనకు ఏదైనా తెలుసు అని భావిస్తే, అతడు గ్రహించ వలసిందేమంటే తాను తెలుసుకోవలసినంత ఇంకా తెలుసుకోలేదు అని. ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవునికి అతడు తెలుసన్నమాట.
అందుచేత విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయానికి వస్తే, ఈ లోకంలో విగ్రహం అనేది వట్టిది అని మనకు తెలుసు. ఒకే ఒక దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని మనకు తెలుసు. దేవుళ్ళు, ప్రభువులు అని అందరూ పిలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆకాశంలో, భూమి మీదా దేవుళ్ళనే వారు ఎంతమంది ఉన్నప్పటికీ, మనకైతే ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన నుండి సమస్తమూ కలిగింది. ఆయన కోసమే మనమున్నాం. అలాగే మనకు ప్రభువు ఒక్కడే ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా అన్నీ కలిగాయి. మనం కూడా ఆయన ద్వారానే ఉనికి కలిగి ఉన్నాం.
అయితే ఈ తెలివి అందరికీ లేదు. కొందరు ఇంతకు ముందు విగ్రహాలను ఆరాధించే వారు కాబట్టి తాము తినే పదార్ధాలు విగ్రహార్పితాలని భావించి తింటారు. వారి మనస్సాక్షి బలహీనం కావడం వలన అది వారికి అపరాధం అవుతుంది. భోజనం విషయంలో మనకు దేవుని నుండి ఏమీ మెప్పు కలగదు. మనం దేనినైనా తినకపోవడం వలన మనం తక్కువ వారం కాదు, తినడం వలన ఎక్కువ వారం కాదు.
అయితే మీకున్న ఈ స్వేచ్ఛ విశ్వాసంలో బలహీనులైన వారికి అభ్యంతర కారణం కాకుండా చూసుకోండి. 10 ఎలా అంటే, సత్యం గురించిన అవగాహన కలిగిన నీవు విగ్రహాలు నిలిపి ఉన్న స్థలంలో తింటూ ఉండగా బలహీనమైన మనస్సాక్షి గలవాడు చూస్తే, అతడు విగ్రహాలకు అర్పించిన పదార్ధాలను తినడానికి ధైర్యం తెచ్చుకుంటాడు కదా? 11 తద్వారా ఎవరి కోసం క్రీస్తు చనిపోయాడో విశ్వాసంలో బలహీనుడైన ఆ నీ సోదరుడు లేక సోదరి నీ తెలివి వలన పాడైపోతాడు.
12 ఈ విధంగా మీరు మీ సోదరులకు వ్యతిరేకంగా పాపం చేయడం ద్వారా, విశ్వాసంలో బలహీనమైన వారి మనస్సాక్షిని నొప్పించడం ద్వారా, మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. 13 కాబట్టి నా భోజనం నా సోదరుడు విశ్వాసంలో జారిపోవడానికి కారణమైతే, నా సోదరునికి అభ్యంతరం కలిగించకుండేలా ఇక నేనెన్నడూ మాంసం తినను.