5
అననీయ, సప్పిరల మరణకరమైన పాపం
1 అననీయ అనే ఒక వ్యక్తి తన భార్య సప్పీరాతో కలిసి పొలం అమ్మాడు. 2 భార్యకు తెలిసే అతడు ఆ డబ్బులో కొంత దాచుకుని కొంత తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.
3 అప్పుడు పేతురు, “అననీయా!, నీ భూమి ఖరీదులో కొంత దాచుకుని సాతాను ప్రేరణకు లొంగి పరిశుద్ధాత్మను ఎందుకు మోసగించావు? 4 అది నీ దగ్గరున్నపుడు నీదే గదా? అమ్మిన తరువాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఈ సంగతిని ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు” అని అతనితో చెప్పాడు.
5 అననీయ ఈ మాటలు వింటూనే కుప్పకూలి ప్రాణం విడిచాడు. అది విన్న వారందరికీ చాలా భయం వేసింది. 6 అప్పుడు కొందరు యువకులు వచ్చి అతణ్ణి గుడ్డలో చుట్టి మోసుకుపోయి పాతిపెట్టారు.
7 సుమారు మూడుగంటల తరువాత అతని భార్య ఏం జరిగిందో తెలియక లోపలికి వచ్చింది. 8 అప్పుడు పేతురు, “మీరు ఆ పొలాన్ని ఇంతకే అమ్మారా? నాతో చెప్పు” అని ఆమెనడిగాడు. అందుకామె, “అవును, యింతకే అమ్మాము” అని చెప్పింది. 9 అందుకు పేతురు, “ప్రభువు ఆత్మను పరీక్షించడానికి మీరెందుకు ఒకటయ్యారు? ఇదిగో, నీ భర్తను పాతిపెట్టిన వారింకా లోపలికైనా రాలేదు. వారు నిన్నూ మోసికుని పోతారు” అని ఆమెతో చెప్పాడు.
10 వెంటనే ఆమె అతని కాళ్ళ దగ్గర పడి ప్రాణం విడిచింది. ఆ యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయిందని చూసి ఆమెనూ మోసికొనిపోయి, ఆమె భర్త పక్కనే పాతిపెట్టారు. 11 సంఘమంతటికీ, ఇంకా ఈ సంగతులు విన్న వారందరికీ చాలా భయం వేసింది.
సంఘం మహాత్మ్యం
12 ప్రజల మధ్య అపొస్తలుల ద్వారా అనేక సూచకక్రియలూ అద్భుతాలూ జరుగుతూ ఉన్నాయి. నమ్మిన వారంతా కలిసి సొలొమోను మంటపంలో కలుసుకుంటూ ఉన్నారు. 13 తక్కిన వారిలో ఎవరికీ వారితో కలిసే ధైర్యం లేదు. అయితే 14 సామాన్య ప్రజలు వారిని గౌరవిస్తూ ఉన్నారు. చాలా మంది స్త్రీ పురుషులు విశ్వసించి ప్రభువు పక్షాన చేరారు.
15 పేతురు వస్తూ ఉంటే ప్రజలు రోగులను వీధుల్లోకి తెచ్చి, వారి మీద అతని నీడ అయినా పడాలని మంచాల మీదా పరుపుల మీదా వారిని ఉంచారు. 16 యెరూషలేము చుట్టూ ఉన్న పట్టణాల్లోని ప్రజలు, రోగులనూ దురాత్మల చేత బాధల పాలౌతున్న వారిని తీసుకొచ్చారు. వారంతా బాగుపడ్డారు.
రెండవ సారి హింసాకాండ
17 ప్రధాన యాజకుడూ అతనితో పాటు ఉన్నవారంతా, అంటే సద్దూకయ్యుల తెగ వారంతా అసూయతో నిండిపోయి 18 అపొస్తలులను పట్టుకుని పట్టణంలోని చెరసాల్లో వేశారు.
19 అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొచ్చి, “మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి 20 ఈ జీవాన్ని గూర్చిన మాటలన్నిటినీ ప్రజలకు చెప్పండి” అని వారితో అన్నాడు. 21 వారా మాట విని, ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళి బోధిస్తూ ఉన్నారు. ప్రధాన యాజకుడూ, అతనితో ఉన్నవారూ వచ్చి, మహాసభ వారిని ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారిని తీసుకు రమ్మని మనుషులను చెరసాలకు పంపారు.
22 భటులు అక్కడికి వెళ్ళి, వారు చెరసాలలో కనబడక పోయేసరికి తిరిగి వచ్చి 23 “చెరసాల చాలా భద్రంగా మూసి ఉంది. కావలివారు తలుపుల ముందు నిలబడి ఉండడం చూశాం గానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకెవరూ కనబడలేదు” అని వారికి చెప్పారు. 24 దేవాలయం అధికారీ, ప్రధాన యాజకులూ ఆ మాట విని ‘ఇది ఏమవుతుందో’ అని వారి విషయమై అయోమయంలో పడిపోయారు.
25 అప్పుడొకడు వచ్చి, “మీరు జైల్లో వేయించిన మనుషులు దేవాలయంలో నిలబడి ప్రజలకు బోధిస్తూ ఉన్నారు” అని చెప్పాడు. 26 అప్పుడు అధికారి సైనికులతో కూడా పోయి, ప్రజలు రాళ్లతో కొడతారేమోనని భయపడి, 27 సౌమ్యంగానే వారిని తీసుకుని వచ్చి మహాసభ ముందుంచాడు. 28 ప్రధాన యాజకుడు వారితో, “ఈ నామంలో బోధించవద్దని మేము మీకు కచ్చితంగా ఆజ్ఞాపించాము గదా. అయినా మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, ఈ వ్యక్తి హత్యానేరాన్ని మా మీదికి తేవాలని చూస్తున్నారు” అని చెప్పాడు.
అపొస్తలుల జవాబు
29 అందుకు పేతురు, మిగిలిన అపొస్తలులు ఇలా జవాబిచ్చారు, “మనుషులకు కాక, దేవునికే మేము లోబడాలి గదా. 30 మీరు మానుకు వేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు లేపాడు. 31 ఇశ్రాయేలుకు హృదయ పరివర్తన, పాప క్షమాపణ దయచేయడానికి దేవుడాయన్ని అధికారిగా, రక్షకునిగా తన కుడి వైపున ఉండే స్థాయికి హెచ్చించాడు. 32 మేమూ, దేవుడు తన విధేయులకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మా, ఈ సంగతులకు సాక్షులం.” 33 వారీమాట విని తీవ్ర కోపంతో వీరిని చంపాలని చూశారు. 34 అప్పుడు అందరి గౌరవం చూరగొన్న ధర్మశాస్త్ర బోధకుడు గమలీయేలు అనే ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి అపొస్తలులను కాసేపు బయట ఉంచమని ఆజ్ఞాపించి వారితో ఇలా అన్నాడు.
గమలీయేలు హితవు
35 “ఇశ్రాయేలీయులారా, ఈ మనుషులకు మీరేమి చేయాలని చూస్తున్నారో జాగ్రత్త సుమా. 36 కొంతకాలం క్రితం థూదా లేచి తాను గొప్పవాడినని చెప్పుకున్నాడు. సుమారు నాలుగు వందల మంది అతనితో కలిశారు. అతడు హతుడయ్యాడు. అతనిని అనుసరించిన వారంతా చెల్లా చెదరై పోయారు.
37 అతని తరువాత జనాభా లెక్కలు తీసే రోజుల్లో గలిలయవాడైన యూదా అనేవాడు లేచి, కొంతమందిని తన వైపుకు ఆకర్షించాడు. వాడు కూడా నశించిపోయాడు, వాణ్ణి అనుసరించిన వారంతా చెదరిపోయారు.
38 కాబట్టి నేను మీతో చెప్పేది ఏమంటే ఈ మనుషుల జోలికి వెళ్ళకుండా వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన గానీ వారి పని గానీ మనుషుల వలన కలిగినదైతే, అది వ్యర్థమై పోతుంది. 39 దేవుని వలన కలిగినదైతే వారిని మీరు ఓడించలేరు. మీరొకవేళ దేవునితో పోరాడే వారవుతారేమో సుమా.”
40 వారతని మాటకు అంగీకరించి, అపొస్తలులను పిలిపించి వారిని కొట్టించి, యేసు నామంలో బోధించ వద్దని ఆజ్ఞాపించి విడుదల చేశారు. 41 ఆ నామాన్ని బట్టి అవమానం పొందడానికి పాత్రులని దేవుడు తమను ఎంచినందుకు అపొస్తలులు సంతోషిస్తూ మహాసభ నుండి వెళ్ళిపోయారు. 42 ప్రతిరోజూ దేవాలయంలో, ఇంటింటా మానకుండా బోధిస్తూ, యేసే క్రీస్తని ప్రకటిస్తూ వచ్చారు.