5
పది ఆజ్ఞలు
1 మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించి ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీకు ఈ రోజు చెబుతున్న కట్టడలను, విధులను విని నేర్చుకుని వాటిని పాటించండి. 2 మన దేవుడు యెహోవా హోరేబులో మనతో ఒప్పందం చేశాడు. 3 ఆయన మన పూర్వీకులతో కాదు, ఈ రోజు, ఇక్కడ జీవించి ఉన్న మనతోనే ఈ ఒప్పందం చేశాడు. 4 యెహోవా ఆ కొండ మీద అగ్నిలో నుండి ముఖాముఖిగా మీతో మాటలాడినప్పుడు మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు.
5 కాబట్టి యెహోవా మాట మీకు తెలపడానికి నేను యెహోవాకూ మీకూ మధ్య నిలబడి ఉన్నప్పుడు యెహోవా ఇలా చెప్పాడు.
6 ‘బానిసల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే.
7 నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు.
8 పైన ఉన్న ఆకాశంలో గాని, కింద ఉన్న భూమిపైనే గాని, భూమి కింద ఉన్న నీళ్లలోనే గాని ఉండే దేని పోలికలోనైనా విగ్రహాన్ని చేసుకోకూడదు.
9 వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజింపకూడదు. మీ దేవుడైన యెహోవా అనే నేను రోషం గల దేవుణ్ణి. నన్ను ద్వేషించేవారి విషయంలో మూడు నాలుగు తరాల వరకూ తండ్రులు చేసిన దోషాన్ని కొడుకులపైకి రప్పిస్తాను. 10 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించే వారి విషయంలో వెయ్యి తరాల వరకూ కరుణిస్తాను.
11 మీ దేవుడు యెహోవా పేరును అనవసరంగా పలకకూడదు, యెహోవా తన పేరును అనవసరంగా పలికేవాణ్ణి దోషిగా ఎంచుతాడు.
12 మీ యెహోవా దేవుడు మీకు ఆజ్ఞాపించినట్టు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి. 13 ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని చేయాలి. 14 ఏడో రోజు మీ యెహోవా దేవునికి విశ్రాంతి దినం. ఆ రోజు మీరు, మీ కొడుకు, కూతురు, దాసుడు లేక దాసి, మీ ఎద్దు లేక గాడిద, మీ పశువుల్లో ఏదైనా సరే, మీ ఇంట్లో ఉన్న పరదేశితో సహా, ఏ పనీ చేయకూడదు. ఎందుకంటే మీకులాగా మీ దాసుడు, మీ దాసి కూడా విశ్రాంతి తీసుకోవాలి.
15 మీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మీ దేవుడు యెహోవా తన బాహుబలంతో, చాచిన చేతితో మిమ్మల్ని అక్కడ నుండి రప్పించాడని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి, విశ్రాంతి దినాన్ని పాటించాలని ఆయన మీకు ఆజ్ఞాపించాడు.
16 మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో మీరు దీర్ఘాయువుతో, సుఖశాంతులు కలిగి ఉండేలా ఆయన మీకు ఆజ్ఞాపించినట్టు మీ తల్లి తండ్రులను గౌరవించండి.
17 హత్య చేయకూడదు.
18 వ్యభిచారం చేయకూడదు.
19 దొంగతనం చేయకూడదు.
20 మీ సాటి మనిషికి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు.
21 మీ పొరుగువాడి భార్యపై ఆశపడకూడదు. మీ పొరుగువాడి ఇంటిని, పొలాన్ని, పనివాణ్ణి, పనికత్తెని, ఎద్దును, గాడిదను, ఇంకా అతనికి చెందిన దేనినీ ఆశించకూడదు.’
22 యెహోవా ఆ కొండ మీద అగ్ని, మేఘం, గాఢాంధకారాల మధ్య నుండి గొప్ప స్వరంతో మీ సమాజమంతటితో ఈ మాటలు చెప్పి, రెండు రాతి పలకల మీద వాటిని రాసి నాకిచ్చాడు. ఇంతకు మించి ఆయన మరేమీ చెప్పలేదు.
23 ఆ కొండ అగ్నితో మండుతున్నప్పుడు మీరు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరం విని, అంటే మీ గోత్రాల ప్రధానులు, పెద్దలు నా దగ్గరికి వచ్చి, 24 ‘మన యెహోవా దేవుడు తన మహిమని గొప్పతనాన్ని మాకు చూపించాడు. అగ్నిలో నుండి ఆయన స్వరాన్ని విన్నాం. దేవుడు మానవులతో మాట్లాడినప్పటికీ వారు బతికి ఉండగలరని ఈ రోజు గ్రహించాం. 25 కాబట్టి మేము చావడమెందుకు? ఈ గొప్ప అగ్ని మమ్మల్ని కాల్చివేస్తుంది. మేము మన దేవుడు యెహోవా స్వరం ఇంకా వింటే చనిపోతాం. 26 మాలాగా మానవులందరిలో సజీవుడైన దేవుని స్వరం అగ్నిలో నుండి పలకడం విని ఇంకెవరు జీవించి ఉన్నారు? 27 నువ్వే వెళ్ళి మన దేవుడు యెహోవా చెప్పేదంతా విను. ఆయన నీతో చెప్పిన దానంతటినీ నువ్వే మాతో చెబితే మేము విని దాన్ని పాటిస్తాం అని చెప్పారు.’
28 మీరు నాతో చెప్పిన మాటలు యెహోవా విన్నాడు. అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు. ‘ఈ ప్రజలు నీతో చెప్పిన మాటలు నేను విన్నాను. వారు చెప్పినదంతా మంచిదే. 29 వారికీ వారి సంతానానికీ ఎప్పుడూ సుఖశాంతులు కలిగేలా వారు నాపట్ల భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని పాటించే మనస్సు వారికి ఉండడం మంచిది. 30 “వారి వారి గుడారాల్లోకి తిరిగి వెళ్ళమని” వారితో చెప్పు. 31 నువ్వు మాత్రం ఇక్కడ నా దగ్గర ఉండు. నువ్వు వారికి బోధించాల్సిన కట్టడలనూ విధులనూ నేను నీతో చెబుతాను.’
32 వారు స్వాధీనం చేసుకోడానికి నేను వారికి ఇస్తున్న దేశంలో వారు ఆ విధంగా ప్రవర్తించాలి. 33 మీరు కుడికి ఎడమకి తిరగకుండా మీ దేవుడు యెహోవా ఆజ్ఞాపించిన విధంగా చేయడానికి జాగ్రత్తపడాలి. మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో నివసిస్తూ సుఖశాంతులతో దీర్ఘాయుష్మంతులయ్యేలా మీ దేవుడు యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గాలన్నిటిలో నడుచుకోవాలి.”