4
ముట్టడికి చెరకూ సంకేతం
1 అయితే నరపుత్రుడా, ఒక పెంకు తీసుకో. దాన్ని నీముఖానికి ఎదురుగా ఉంచుకో. దాని పైన యెరూషలేము పట్టణం నమూనాను చిత్రించు. 2 అది శత్రువుల ముట్టడిలో ఉన్నట్టుగా, దాని ఎదుట ప్రాకారాలు నిర్మించినట్టుగా చిత్రించు. దానిపై దాడి చేయడానికి వీలుగా ఉన్నత ప్రాంతాలనూ, దాని చుట్టూ సైనిక శిబిరాలనూ చిత్రించు. ప్రాకారాలను ధ్వంసం చేసే యంత్రాలను చిత్రించు. 3 తరువాత నువ్వు ఒక ఇనుప రేకును తీసుకుని దాన్ని నీకూ పట్టణానికీ మధ్య ఇనుప గోడగా నిలబెట్టు. పట్టణం ముట్టడికి గురౌతుంది కాబట్టి పట్టణానికి అభిముఖంగా నిలబడు. నీవు పట్టణాన్ని ముట్టడిస్తున్నట్టు ఉంటావు. ఇశ్రాయేలు జాతికి ఇది సూచనగా ఉంటుంది.
4 ఆ తరువాత నీ ఎడమ వైపుకి తిరిగి పడుకో. ఇశ్రాయేలు జాతి పాపాన్నంతా నీ పైకి వేసుకో. ఇశ్రాయేలు జాతికి వ్యతిరేకంగా నువ్వు ఎన్ని రోజులు అలా పండుకుంటావో అన్ని రోజులు వారి పాపాన్ని మోస్తావు. 5 ఆ రోజులను నేనే నిర్ణయిస్తున్నాను. ఇశ్రాయేలు జాతి పాపం చేసిన కాలంలో ఒక్కో సంవత్సరం ఒక్కో రోజుగా నువ్వు భరించాలి. అంటే 390 రోజులు! ఈ విధంగా నువ్వు ఇశ్రాయేలు జాతి పాపాన్ని భరిస్తావు.
6 ఆ రోజులన్నీ గడిచిన తరువాత రెండో సారి నీ కుడి వైపుకి పడుకో. ఈ సారి నలభై రోజులు నువ్వు యూదా జాతి పాపాన్ని మోస్తావు. ఒక్కో సంవత్సరానికి ఒక్కో రోజు నీకు నేను నిర్ణయించాను. 7 తరువాత ముట్టడిలో ఉన్న యెరూషలేముకి వ్యతిరేకంగా నిలబడి చొక్కా తీసివేసిన నీ చేతిని ఎత్తి దానికి వ్యతిరేకంగా ప్రవచించాలి. 8 నువ్వు పట్టణాన్ని ముట్టడించినట్టు ఉండే ఆ రోజులు పూర్తయే వరకూ నువ్వు కదలకుండా నిన్ను బంధించి ఉంచుతాను.
9 నీ కోసం గోధుమలూ, బార్లీ, చిక్కుడు గింజలూ, కాయ ధాన్యాలూ, జొన్నలూ, సజ్జలూ తెచ్చుకో. వాటన్నిటినీ ఒక పాత్రలో వేసి నువ్వు ఒక వైపున పడుకునే రోజుల లెక్క ప్రకారం రొట్టెలు చేసుకోవాలి. 390 రోజులు నువ్వు ఇలాగే చేసుకుని తినాలి! 10 నువ్వు తీసుకునే ఆహారం ఇదే. రోజుకి రెండు వందల గ్రాముల ప్రకారం తీసుకోవాలి. అది ప్రతి రోజూ సమయానికి తింటూ ఉండాలి. 11 అలాగే నీళ్ళు కొలత ప్రకారం ప్రతి రోజూ రెండు గ్లాసులు తాగాలి. సమయానికి నీళ్లు తాగుతూ ఉండాలి.
12 బార్లీతో చేసే అప్పడాల్లా వాటిని చేసుకుని తినాలి. అందరూ చూస్తుండగా వాటిని మనిషి మలాన్నే వంట చేయడానికి ఉపయోగిస్తూ కాల్చి తినాలి! 13 యెహోవా ఇలా చెప్తున్నాడు. “నేను వెళ్ళగొట్టినప్పుడు వాళ్ళు వెళ్ళే జాతులమధ్య ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు అపవిత్రమైన ఆహారం తినవలసి వస్తుంది.”
14 కానీ నేను “అయ్యో, ప్రభూ! యెహోవా! నేను ఏనాడూ అపవిత్రం కాలేదు. చిన్నప్పట్నించి చనిపోయిన దాన్ని గానీ, మృగాలు చంపిన దాన్ని గానీ నేను తినలేదు. అపవిత్రమైన మాంసం ఏనాడూ నా నోట్లో ప్రవేశించలేదు” అన్నాను. 15 దానికి ఆయన “చూడు మనిషి మలానికి బదులు నేను నీకు ఆవు పేడను నిర్ణయించాను. నువ్వు పిడకలతో నీ రొట్టెలు చేసుకోవచ్చు” అన్నాడు.
16 ఇంకా ఆయన నాకు ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, చూడు, నేను యెరూషలేములో రొట్టె అనే ఆధారం లేకుండా చేస్తున్నాను. వాళ్ళు ఆందోళనతో ఒక పరిమితి ప్రకారం రొట్టెలు తింటారు. నీళ్ళు కూడా కొలత ప్రకారం భయంతో తాగుతారు. 17 వాళ్లకి ఆహారం, నీళ్ళు కరువై పోతాయి. ప్రతి ఒక్కడూ తన సహోదరుడి వైపు దిగులుతో చూస్తాడు. తాము చేసిన పాపాల వలన నశించిపోతారు.”