3
బలిపీఠం తిరిగి కటడం
ఏడవ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణాలకు తిరిగి వచ్చి ఏకమనస్సుతో యెరూషలేములో సమావేశమయ్యారు. దైవసేవకుడు మోషే నియమించిన ధర్మశాస్త్రంలో రాసి ఉన్నట్టు దహన బలులు అర్పించడానికి యోజాదాకు కొడుకు యేషూవ, యాజకులైన అతని బంధువులు, షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, అతని బంధువులు కలిసి ఇశ్రాయేలీయుల దేవునికి బలిపీఠం కట్టారు. వారు అక్కడ నివాసం ఉంటున్న వారికి భయపడి, ఆ బలిపీఠాన్ని ఇంతకు ముందు ఉన్న స్థలం లోనే నిలబెట్టి దానిపై ఉదయం, సాయంత్రం యెహోవాకు దహనబలులు అర్పిస్తూ వచ్చారు.
ధర్మశాస్త్రంలో రాసి ఉన్నట్టు పర్ణశాలల పండగ ఆచరించి, ఏ రోజు ఆచరించాల్సిన నియమాలను లెక్క ప్రకారం ఆ రోజుల్లో ఆచరిస్తూ దహనబలులు అర్పిస్తూ వచ్చారు. తరువాత అనుదినం అర్పించాల్సిన దహన బలులు, అమావాస్యలకు యెహోవా కోసం నియమితమైన పండగలకు ప్రతిష్ఠితమైన దహనబలులు, ప్రతి ఒక్కరూ తీసుకు వచ్చిన స్వేచ్ఛార్పణలు అర్పిస్తూ వచ్చారు.
ఏడవ నెల మొదటి రోజు నుండి యెహోవాకు దహన బలులు అర్పించడం ఆరంభించారు. అయితే యెహోవా మందిరానికి ఇంకా పునాది వేయలేదు.
దేవాలయం తిరిగి కట్టడం ఆరంభించడం
వారు తాపీ పనివారికి, వడ్రంగం పనివారికి డబ్బు ఇచ్చారు. ఇంకా పర్షియా దేశపు రాజు కోరెషు తమకు చెప్పిన విధంగా లెబానోను నుండి దేవదారు మానులను సముద్ర మార్గంలో యొప్పే పట్టణానికి తెప్పించడానికి సీదోను, తూరు వారికి భోజన పదార్థాలు, పానీయాలు, నూనె ఇచ్చారు.
యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి వారు వచ్చిన రెండవ సంవత్సరం రెండవ నెలలో షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, యోజాదాకు కొడుకు యేషూవ, చెరలో నుండి విడుదలై యెరూషలేముకు వచ్చిన వారు, అందరూ కలిసి పని ప్రారంభించారు. ఇరవై సంవత్సరాలు నిండిన లేవీయులు యెహోవా మందిరం కట్టే పనికి నియమితులయ్యారు.
యేషూవ కొడుకులు, సహోదరులు, కద్మీయేలు, అతని కొడుకులు, యుదా* 3:9 యుదా హోదవ్యా కొడుకులు, హేనాదాదు కొడుకులు, అతని మనుమలు, లేవీయులైన వారి బంధువులు దేవుని మందిరంలో పని చేసేవారిపై పర్యవేక్షకులుగా నియమితులయ్యారు. 10 రాతి చెక్కడం పనివారు యెహోవా మందిరం పునాది వేస్తూ ఉన్న సమయంలో ఇశ్రాయేలు రాజు దావీదు నిర్ణయించిన క్రమం ప్రకారం యాజకులు తమ వస్త్రాలు ధరించుకుని బాకాలతో నిలబడ్డారు. ఆసాపు వంశం వారైన లేవీయులు చేతి తాళాలతో యెహోవాను స్తుతించారు. 11 వీరు వంతుల వారీగా “యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల మీద ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది” అని పాడుతూ యెహోవాను కీర్తించారు. యెహోవా మందిరం పునాది పడడం చూసిన ప్రజలంతా గొప్ప శబ్దంతో యెహోవాను స్తుతించారు.
12 గతంలో ఉన్న మందిరాన్ని చూసిన యాజకుల్లో, లేవీయుల కుటుంబ పెద్దల్లో ముసలివారు చాలామంది ఇప్పుడు వేస్తున్న మందిరం పునాదిని చూసి గట్టిగా ఏడ్చారు. కొంతమంది సంతోషంతో గట్టిగా కేకలు వేశారు. 13 ఏవి ఏడుపులో, ఏవి హర్ష ధ్వానాలో ప్రజలు తెలుసుకోలేక పోయారు. ప్రజలు వేసిన కేకల శబ్దం చాలా దూరం వినబడింది.

*3:9 3:9 యుదా హోదవ్యా