13
ఎఫ్రాయిము వినాశనం
ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయం కలిగింది.
అతడు ఇశ్రాయేలు వారిలో తనను గొప్ప చేసుకున్నాడు.
తరువాత బయలు దేవుణ్ణి బట్టి అపరాధియై అతడు నాశనమయ్యాడు.
ఇప్పుడు వారు ఇంకా పాపం చేస్తూ ఉన్నారు.
తమకు చేతనైనంత నైపుణ్యంతో వెండి విగ్రహాలు పోతపోస్తారు.
అదంతా నిపుణులు చేసే పనే.
“వాటికి బలులు అర్పించే వారు దూడలను ముద్దు పెట్టుకోండి” అని చెబుతారు.
కాబట్టి వారు ఉదయాన కనబడే మబ్బులాగా,
పెందలకడ ఆరిపోయే ప్రాతఃకాలపు మంచులాగా ఉంటారు.
కళ్ళంలో నుండి గాలి ఎగరగొట్టే పొట్టులాగా,
పొగ గొట్టంలో గుండా వెళ్ళిపోయే పొగలాగా ఉంటారు.
మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి తెచ్చిన యెహోవానైన నేనే మీ దేవుణ్ణి.
నన్ను తప్ప నీవు ఏ దేవుడినీ గుర్తించ కూడదు.
నేను తప్ప వేరే రక్షకుడు లేడు.
మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్నెరిగిన వాణ్ణి నేనే.
తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందారు. తృప్తి పొంది గర్వించి నన్ను మర్చి పోయారు.
కాబట్టి నేను వారికి సింహం వంటి వాడనయ్యాను.
చిరుత పులి దారిలో పొంచి ఉన్నట్టు నేను వారిని పట్టుకోవడానికి పొంచి ఉంటాను.
పిల్లలు పోయిన ఎలుగుబంటి దాడి చేసినట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేస్తాను.
ఆడసింహం మింగివేసినట్టు వారిని మింగివేస్తాను.
క్రూరమృగాల్లాగా వారిని చీల్చివేస్తాను.
ఇశ్రాయేలూ, నీ మీదికి వచ్చి పడేది నీ నాశనమే. నీ సహాయకర్తనైన నాకు నీవు విరోధివయ్యావు.
10 నీ రాజు ఏడి? నీ పట్టణాల్లో నీకు సహాయం చేయకుండ నీ రాజు ఏమైపోయాడు?
“రాజును అధిపతులను నా మీద నియమించు” అని నీవు మనవి చేశావు గదా?
11 కోపంతో నీకు రాజును నియమించాను.
క్రోధంతో అతణ్ణి తీసి పారేశాను.
12 ఎఫ్రాయిము దోషం పోగుపడింది.
అతని పాపం పోగుపడింది.
13 ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన కలుగుతుంది.
ప్రసవం సమయంలో బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు.
14 అయినా పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచిస్తానా?
మృత్యువు నుండి వారిని రక్షిస్తానా?
ఓ మరణమా, నీవు తెచ్చే బాధలు ఎక్కడ? వాటిని ఇటు తీసుకురా.
పాతాళమా, నీ నాశనం ఏది? దాన్ని ఇటు తీసుకురా.
నాకు కనికరం పుట్టదు.
15 ఎఫ్రాయిము తన సోదరుల్లో వర్థిల్లినా,
తూర్పు గాలి వస్తుంది.
యెహోవా పుట్టించే గాలి అరణ్యంలో నుండి లేస్తుంది.
అది రాగా అతని నీటిబుగ్గలు ఎండి పోతాయి.
ఎఫ్రాయిము ఊటలు ఇంకిపోతాయి.
అతని బావిలో నీరు ఉండదు. అతని శత్రువులు అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువులన్నిటిని కొల్లగొడతారు.
16 షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసింది గనక,
ప్రజలు కత్తివాత కూలుతారు.
వారి పిల్లలను రాళ్లకేసి కొడతారు. గర్భవతుల కడుపులు చీరేస్తారు.