25
యెహోవాను స్తుతించండి
యెహోవా, నీవే నా దేవుడివి. నేను నిన్ను ఘన పరుస్తాను. నీ నామాన్ని స్తుతిస్తాను. నీవు అద్భుతాలు చేశావు. సత్య స్వభావాన్ననుసరించి నీవు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచనలు నెరవేర్చావు.
నీవు శత్రువుల నగరాన్ని దిబ్బగా చేశావు. ప్రాకారాలున్న పట్టణాన్ని శిథిలంగా చేశావు. అన్యుల కోటను పట్టణంగా మళ్ళీ ఉండకుండా చేశావు. అది మళ్ళీ ఎప్పుడూ నిర్మాణం కాకుండా చేశావు.
కాబట్టి బలిష్ఠులైన ప్రజలు నిన్ను ఘనపరుస్తారు. క్రూర జనం నివసించే పట్టణవాసులు నీకు భయపడతారు. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలే ఉండగా నీవు పేదలకు శరణుగా ఉన్నావు.
ఎందుకంటే దరిద్రులకు నీవు భద్రతగాను, అవసరతలో ఉన్నవారికి సంరక్షకునిగానూ ఉన్నావు. గాలివానలో ఆశ్రయంగాను వేసవిలో నీడగానూ ఉన్నావు. నిర్దయుల ఊపిరి సెగలాగా గోడకి తగులుతున్న తుఫానులాగా ఉంటే నీవు కవచంగా ఉన్నావు.
ఎండ వేడిమి వర్షాభావం ఉన్న ప్రదేశాన్ని అణచి వేసినట్టు నీవు అన్యుల ఘోషను అణచివేశావు. మేఘం నీడలో ఎండ చల్లారి పోయినట్టు బలాత్కారుల జయకీర్తన అణిగి పోతుంది.
ఈ పర్వతంపై సేనల ప్రభువు యెహోవా ప్రజలందరి కోసం కొవ్విన వాటితో విందు చేస్తాడు. మడ్డి మీద ఉన్న ద్రాక్షారసంతో విందు చేస్తాడు. మూలుగు ఉన్న కొవ్విన వాటితో విందు చేస్తాడు. మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షారసంతో విందు చేస్తాడు.
జాతులందరి ముఖాలను కప్పుతున్న ముసుకును సమస్త జాతుల మీద పరిచిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేస్తాడు.
మరెన్నడు ఉండకుండా మరణాన్ని ఆయన మింగి వేస్తాడు. ప్రభువైన యెహోవా ప్రతివాడి ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేస్తాడు. భూమి మీద నుండి తన ప్రజల నిందను తీసివేస్తాడు. ఇలా జరుగుతుందని యెహోవా సెలవిచ్చాడు.
ఆ దినాన ప్రజలు ఇలా అంటారు. ఇదిగో మనలను రక్షిస్తాడని మనం కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనం ఎదురు చూసిన యెహోవా ఈయనే. ఆయన ఇచ్చే రక్షణ విషయం సంతోషించి ఉత్సాహ పడదాము.
10 యెహోవా హస్తం ఈ సీయోను పర్వతం మీద నిలుస్తుంది. పెంటకుప్పలో వరిగడ్డిని తొక్కినట్టు మోయాబీయులు తాము ఉన్న చోటనే తొక్కబడతారు.
11 ఈతగాళ్ళు ఈదడానికి తమ చేతులను చాపినట్టు వారు దాని మధ్య తమ చేతులు చాపుతారు. వారెన్ని తంత్రాలు పన్నినా యెహోవా వారి గర్వం అణచివేస్తాడు.
12 మోయాబూ, నీ ప్రాకారాలను, ఎత్తయిన కోటలను ఆయన కూల్చి వేస్తాడు. వాటిని నేలకు అణగదొక్కి ధూళి పాలు చేస్తాడు.