33
కష్టాలు, సహయం
దోపిడీకి గురి కాకుండా దోచుకుంటూ ఉండే నీకు బాధ!
ద్రోహానికి గురి కాకుండానే ద్రోహం చేస్తూ ఉండే నీకు బాధ!
నువ్వు నాశనం చేయడం ముగించిన తర్వాతే నువ్వు నాశనం అవుతావు.
నువ్వు ద్రోహం చేయడం ముగించిన తర్వాత నీకు ద్రోహం జరుగుతుంది.
యెహోవా, నీ కోసం వేచి చూస్తున్నాం. మమ్మల్ని కరుణించు.
ప్రతి ఉదయం మాకు సహాయంగా, ఆపదల్లో మాకు రక్షగా ఉండు.
మహా శబ్దాన్ని విని జనాలు పారిపోతారు. నువ్వు లేచినప్పుడు దేశాలు చిందర వందర అవుతాయి.
మిడతలు తిని వేసినట్టు మీ సంపదలు దోపిడీకి గురౌతాయి. మిడతల దండులా శత్రువులు దానిమీద పడతారు.
యెహోవా మహా ప్రశంస పొందాడు. ఆయన ఉన్నత స్థలంలో నివసిస్తున్నాడు. ఆయన సీయోనును నీతితో, న్యాయంతో నింపుతాడు.
నీ కాలంలో నీ స్థిరత్వం ఆయనే.
నీకు పుష్కలమైన రక్షణ, జ్ఞానమూ, వివేకమూ ఆయనే. యెహోవా భయం అతని ఐశ్వర్యం.
వాళ్ళ రాయబారులు వీధిలో ఏడుస్తున్నారు. సంధిని కోరుకునే వాళ్ళ రాజనీతిజ్ఞులు ఒకటే రోదిస్తున్నారు.
రాజమార్గాలు నిర్మానుష్యమై పోయాయి. వాటి మీద ప్రయాణీకులు ఎవ్వరూ లేరు.
సంధి ఒప్పందాలను ఉల్లంఘించారు. సాక్షులను అలక్ష్యం చేశారు. పట్టణాలను అవమానపరిచారు.
దేశం దుఖిస్తుంది. క్షీణించి పోతుంది. లెబానోను కలవరపడి వాడిపోతుంది.
షారోను ఎడారిలా ఉంది. బాషాను, కర్మెలు తమ చెట్ల ఆకులు రాలుస్తున్నాయి.
10 “ఇప్పుడు నేను నిలబడతాను” అని యెహోవా అనుకున్నాడు. “ఇప్పుడే నా ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తాను. నన్ను నేను గొప్ప చేసుకుంటాను.
11 మీరు పొట్టును గర్భం ధరించారు. చెత్త పరకలను కంటారు. మీ శ్వాస అగ్నిలా మిమ్మల్ని కాల్చేస్తుంది.
12 జనాలు సున్నంలా కాలిపోతారు. ముళ్ళ పొదలను నరికి కాల్చినట్టుగా కాలిపోతారు.
13 దూరంలో నివసించే మీరు నేను చేసిందేమిటో వినండి. సమీపంలో ఉన్న వాళ్ళు నా శక్తిని అంగీకరించండి.”
14 సీయోనులో ఉన్న పాపులు భయపడుతున్నారు. దేవుణ్ణి లెక్క చెయ్యని వారికి వణుకు పట్టుకుంది.
మనలో మండే అగ్నితో కలసి ప్రయాణించే వాడు ఎవరు? నిత్యమూ మండే వాటితో ఎవరు నివసిస్తారు?
15 నీతి కలిగి జీవించేవాడూ, యథార్ధంగా మాట్లాడేవాడూ, అవినీతి వల్ల కలిగే లాభాన్ని అసహ్యించుకునే వాడూ, లంచాన్ని తిరస్కరించేవాడూ, హింసాత్మక నేరం చేయాలని ఆలోచించని వాడూ చెడుతనం చూడకుండా కళ్ళు మూసుకునే వాడూ,
16 అలాంటి వాడు ఉన్నత స్థలాల్లో నివసిస్తాడు. అతనికి పర్వత శిఖరాలపైని శిలలు ఆశ్రయంగా ఉంటాయి. ఆహారమూ, నీళ్ళూ క్రమంగా అతనికి లభ్యమౌతాయి.
17 నీ కళ్ళు రాజును అతని సౌందర్యమంతటితో చూస్తాయి. విశాలమైన దేశాన్ని నీ కళ్ళు చూస్తాయి.
18 నీ హృదయం భయాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. శాస్త్రి ఎక్కడ ఉన్నాడు? డబ్బును తూచిన వాడు ఎక్కడ ఉన్నాడు? గోపురాలను లెక్కించేవాడు ఎక్కడ ఉన్నాడు?
19 నువ్వు అర్థం చేసుకోలేని తెలియని భాష మాట్లాడుతూ తిరస్కరించే ఆ జనాన్ని నువ్వు చూడవు.
20 మన పండగల పట్టణం అయిన సీయోనుని చూడండి!
యెరూషలేమును ప్రశాంతమైన నివాస స్థలంగా నువ్వు చూస్తావు. అది తొలగించలేని గుడారంగా ఉంటుంది.
దాని మేకులను ఎన్నటికీ ఊడదీయరు. దాని తాళ్లలో దేనినీ తెంచరు.
21 దానికి ప్రతిగా విశాలమైన నదులూ, నీటి వాగులూ ఉన్న ఆ స్థలంలో యెహోవా తన ప్రభావంతో మనతో ఉంటాడు.
తెడ్లు వేసుకుంటూ అక్కడ ఏ యుద్ధనౌకా ప్రయాణించదు. పెద్ద నౌకలేవీ అక్కడ ప్రయాణించవు.
22 ఎందుకంటే యెహోవా మనకు న్యాయాధిపతి. యెహోవా మన శాసనకర్త. యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షిస్తాడు.
23 నీ ఓడ తాళ్లు వదులై పోయాయి. స్తంభం అడుగు భాగం స్థిరంగా లేదు. ఓడ తెరచాపను ఎవరూ విప్పడం లేదు. విస్తారమైన దోపిడీ సొమ్మును పంచుకుంటారు. అప్పుడు కుంటి వాళ్ళు కూడా ఆ సొమ్ములో భాగం పొందుతారు.
24 సీయోనులో నివాసం చేసే వాళ్ళెవ్వరూ “నాకు ఆరోగ్యం బాగా లేదు” అని చెప్పరు. అక్కడి ప్రజలు చేసిన పాపాలకు క్షమాపణ దొరుకుతుంది.