26
యేసు వధకై యూదు నాయకుల కుట్ర
మార్కు 14:1-2; లూకా 22:1-2
యేసు ఈ మాటలు చెప్పడం ముగించిన తరువాత ఆయన తన శిష్యులతో, “రెండు రోజుల తరువాత పస్కా పండగ వస్తుందని మీకు తెలుసు. అప్పుడు మనుష్య కుమారుణ్ణి సిలువ వేయడానికి అప్పగిస్తారు” అని చెప్పాడు.
ఆ సమయంలోనే ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు కయప అనే ప్రధాన యాజకుడి నివాసంలో సమావేశమయ్యారు. వారంతా ఏకమై కుట్ర చేసి యేసును పట్టుకుని, చంపాలని కుయుక్తులు పన్నారు. అయితే ప్రజల్లో అల్లరి జరుగుతుందేమో అని “పండగ సమయంలో వద్దు” అని చెప్పుకున్నారు.
బేతనీ మరియ యేసుకు చేసిన అభిషేకం
మార్కు 14:3-9; యోహా 12:1-8
యేసు బేతనీలో కుష్టురోగి సీమోను ఇంట్లో ఉన్నాడు. ఆ సమయంలో ఒక స్త్రీ పాలరాతి సీసాలో బాగా ఖరీదైన అత్తరు తెచ్చి, ఆయన భోజనానికి కూర్చుని ఉన్నప్పుడు ఆయన తలమీద ఆ అత్తరు పోసింది. అది చూసి శిష్యులకు కోపం వచ్చింది. వారు ఆమెతో, “ఎంత నష్టం! దీన్ని మంచి ధరకు అమ్మి ఆ సొమ్మును పేదలకు దానం చెయ్యవచ్చు కదా?” అన్నారు. 10 యేసు ఆ సంగతి గ్రహించి, “ఈ స్త్రీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈమె నా విషయంలో ఒక మంచి పని చేసింది. 11  బీదవారు మీ దగ్గర ఎప్పుడూ ఉంటారు. కానీ నేను ఎల్లకాలం మీతో ఉండను. 12  ఈమె ఈ అత్తరు నా శరీరంపై పోసి నా భూస్థాపన కోసం సిద్ధం చేసింది. 13  నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ లోకమంతటిలో సువార్త ప్రకటన ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ఈమెనూ, ఈమె చేసిన పనినీ అందరూ గుర్తు చేసుకుని ప్రశంసిస్తారు.”
యూదు నాయకులతో ఇస్కరియోతు యూదా లాలూచీ
మార్కు 14:10-11; లూకా 22:3-6
14 అప్పుడు పన్నెండు మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. 15 “యేసును మీకు పట్టిస్తే నాకేమిస్తారు?” అని అతడు వారినడిగాడు. వారు ముప్ఫై వెండి నాణాలు లెక్కపెట్టి అతనికి ఇచ్చారు. 16 అతడు అప్పటి నుండి ఆయనను వారికి పట్టివ్వడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.
పస్కా ఏర్పాట్లు
మార్కు 14:12-16; లూకా 22:7-13
17 పొంగని రొట్టెల పండగలో మొదటి రోజు శిష్యులు యేసు దగ్గరికి వచ్చి, “మనం పస్కా భోజనాన్ని ఆచరించడానికి ఏర్పాట్లు ఎక్కడ చేయమంటావు?” అని అడిగారు. 18 అందుకాయన, “మీరు పట్టణంలో ఫలాని వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నా కాలం సమీపించింది. నా శిష్యులతో కలిసి నీ ఇంట్లో పస్కా భోజనం చేస్తాను, అని మా గురువు అంటున్నాడని అతనితో చెప్పండి” అన్నాడు. 19 యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి శిష్యులు పస్కాను సిద్ధం చేశారు.
చివరి భోజనం
మార్కు 14:17-21; లూకా 22:14-20; 24-30; యోహా 13:2-30
20 సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో భోజనానికి కూర్చున్నాడు. 21 వారు భోజనం చేస్తుండగా ఆయన, “మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగిస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. 22 అందుకు వారు చాలా దుఃఖంలో మునిగిపోయారు. ప్రతి ఒక్కడూ, “ప్రభూ, అది నేనా?” అని ఆయనను అడగడం ప్రారంభించారు. 23 ఆయన, “నాతో కలిసి పాత్రలో చెయ్యి ముంచి భోజనం చేసేవాడే నన్ను పట్టిస్తాడు.
24  మనుష్య కుమారుణ్ణి గురించి రాసి ఉన్న ప్రకారం ఆయన చనిపోవలసిందే గాని ఆయనను ఎవరు పట్టిస్తాడో ఆ వ్యక్తికి యాతన తప్పదు. ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండకపోతే అతనికి మంచిది” అని వారితో చెప్పాడు. 25 ఆయనను అప్పగించబోయే యూదా, “ప్రభూ, నేను కాదు కదా?” అని అడగ్గానే ఆయన, “నీవే చెబుతున్నావు కదా?” అన్నాడు.
ప్రభు రాత్రి భోజన సంస్కార స్థాపన
మార్కు 14:22-25; లూకా 22:17-20; 1కొరింతీ 11:23-25
26 వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసుకుని స్తుతులు చెల్లించి, విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీన్ని మీరు తీసుకుని తినండి. ఇది నా శరీరం” అని చెప్పాడు. 27 తరువాత ఆయన ద్రాక్ష రసం పాత్ర తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి, “దీనిలోనిది మీరంతా తాగండి. 28  ఇది నా రక్తం. అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కోసం నేను చిందించబోతున్న కొత్త నిబంధన రక్తం. 29  నా తండ్రి రాజ్యంలో మీతో కలిసి ఇలాటి ద్రాక్షరసం మళ్ళీ తాగే రోజు వరకూ నేనిక దాన్ని తాగనని మీతో చెబుతున్నాను” అన్నాడు.
30 అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళారు.
పేతురు తనను ఎరగనంటాడని యేసు ముందుగా చెప్పడం
మార్కు 14:26-31; లూకా 22:31-34; యోహా 13:36-38; యోహా 14:1-31
31 అప్పుడు యేసు వారితో, “ఈ రాత్రి మీరంతా నా విషయంలో తొట్రుపడతారు. ఎందుకంటే,
‘కాపరిని దెబ్బ తీస్తాను, మందలోని గొర్రెలు చెదరిపోతాయి’ అని రాసి ఉంది కదా!
32  కాని నేను మరణం నుండి తిరిగి లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకి వెళ్తాను” అన్నాడు.
33 అందుకు పేతురు, “నీ విషయంలో అందరూ వెనుకంజ వేసినా సరే నేను మాత్రం ఎన్నటికీ వెనుకంజ వేయను” అని యేసుతో చెప్పాడు. 34 యేసు అతణ్ణి చూసి, “నేను నీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నీవు మూడుసార్లు చెబుతావు” అన్నాడు. 35 పేతురు ఆయనతో, “నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా సరే, నిన్ను ఎరగనని చెప్పను” అన్నాడు. మిగిలిన శిష్యులందరూ అవే మాటలు పలికారు.
గేత్సేమనే తోటలో యేసు వేదన
మార్కు 14:32-42; లూకా 22:39-46; యోహా 18:1; యోహా 18:15, 16, 17
36 ఆ తరువాత, యేసు వారితో కలిసి గేత్సేమనే అనే చోటికి వచ్చాడు. ఆయన, “నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వచ్చే వరకూ మీరు ఇక్కడే కూర్చోండి” అని వారితో చెప్పాడు. 37 పేతురును, జెబెదయి ఇద్దరు కొడుకులను తన వెంట తీసుకు వెళ్ళి తీవ్రమైన దుఃఖంలో, కలతలో మునిగిపోయాడు. 38 అప్పుడు ఆయన వారితో, “నా ప్రాణం పోయేటంతగా నాకు దుఃఖం ముంచుకొస్తూ ఉంది. మీరు ఇక్కడే నిలిచి నాతో కలిసి మెలకువగా ఉండండి” అని చెప్పాడు.
మొదటి ప్రార్థన
మార్కు 14:35; లూకా 22:41-42
39 ఆయన కొంత దూరం వెళ్ళి, సాగిలపడి, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసివేయి. అయినా నీ ఇష్టమే నెరవేరాలి, నా ఇష్టం కాదు” అని ప్రార్థన చేశాడు. 40 శిష్యుల దగ్గరికి వచ్చి, వారు నిద్ర పోతుండడం చూసి, “నాతో కలిసి ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేరా? 41  మీరు పరీక్షలో పడకుండా ఉండేందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమేగానీ శరీరం బలహీనం” అని పేతురుతో అన్నాడు.
రెండవ ప్రార్థన
మార్కు 14:39; లూకా 22:44
42 యేసు రెండవ సారి దూరంగా వెళ్ళి, “నా తండ్రీ, నేను దీన్ని తాగితేనే తప్ప నా నుండి తీసివేయడం సాధ్యం కాదనుకుంటే, నీ చిత్తమే నెరవేరనీ!” అని ప్రార్థన చేశాడు. 43 ఆయన తిరిగి వచ్చి, వారు ఇంకా నిద్రపోతూ ఉండడం చూశాడు. వారి కళ్ళు నిద్రాభారంతో మూతలు పడుతున్నాయి.
మూడవ ప్రార్థన
మార్కు 14:41
44 ఆయన వారిని మళ్ళీ విడిచి వెళ్ళి, ఆ మాటలే తిరిగి చెబుతూ మూడోసారి ప్రార్థన చేశాడు. 45 అప్పుడాయన తన శిష్యుల దగ్గరికి తిరిగి వచ్చి ఇలా అన్నాడు, “మీరింకా విశ్రాంతిగా నిద్రపోతున్నారా? వినండి, మనుష్య కుమారుణ్ణి పాపాత్ముల చేతులకు అప్పగించే సమయం వచ్చేసింది. 46  ఇంక వెళ్దాం, లేవండి. నన్ను వారికి పట్టిచ్చేవాడు సమీపించాడు.”
యేసును బంధించడం
మార్కు 14:43-50; లూకా 22:47-53; యోహా 18:3-11
47 ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా వచ్చాడు. అతనితో ప్రధాన యాజకుల దగ్గర నుంచీ, ప్రజల పెద్దల నుంచీ వచ్చిన పెద్ద గుంపు ఉంది. వారి చేతుల్లో కత్తులు, గదలు ఉన్నాయి. 48 ఆయనను పట్టి ఇచ్చేవాడు, “నేనెవరికి ముద్దు పెడతానో ఆయనే యేసు. ఆయనను మీరు పట్టుకోండి” అని వారికి ముందుగానే ఒక గుర్తు చెప్పాడు. 49 అతడు యేసు దగ్గరికి వచ్చి, “బోధకా, నీకు శుభం!” అంటూ ఆయనకు ముద్దు పెట్టాడు. 50 యేసు, “మిత్రమా, నీవేం చేయాలనుకున్నావో అది చెయ్యి” అని అతనితో చెప్పగానే వారు దగ్గరికి వచ్చి ఆయనను ఒడిసి పట్టుకున్నారు.
51 వెంటనే యేసుతో ఉన్నవారిలో ఒకడు తన చెయ్యి చాపి, కత్తి బయటికి తీసి ప్రధాన యాజకుడి సేవకుణ్ణి కొట్టి, అతని చెవి నరికేశాడు. 52 అప్పుడు యేసు, “నీ కత్తి నీ వరలో తిరిగి పెట్టు. కత్తి వాడేవారంతా కత్తితోనే నాశనం అవుతారు. 53  ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన పన్నెండు సేనా వ్యూహాలకంటే ఎక్కువ మంది దేవదూతలను వెంటనే పంపడనుకుంటున్నావా? 54  నేనలా వేడుకుంటే అంతా ఈ విధంగా జరగాలని ఉన్న లేఖనం ఎలా నెరవేరుతుంది?” అని అతనితో అన్నాడు.
55 తరువాత యేసు ఆ గుంపు వైపు చూసి, “ఒక దోపిడీ దొంగ మీదికి వచ్చినట్టు నన్ను పట్టుకోడానికి మీరు కత్తులు, గదలతో వచ్చారా? ప్రతి రోజూ నేను దేవాలయంలో బోధించేటప్పుడు నన్ను పట్టుకోలేదే, 56  ప్రవక్తల లేఖనాలు నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది” అని చెప్పాడు. అప్పుడు శిష్యులంతా ఆయనను విడిచిపెట్టి పారిపోయారు.
కయప ఎదుటా సన్హెడ్రిన్ ఎదుటా యేసు
మార్కు 14:53-65; యోహా 18:12; 19-24
57 యేసును పట్టుకున్న వారు ఆయనను ప్రధాన యాజకుడు కయప దగ్గరికి తీసుకుపోయారు. అక్కడ ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు సమావేశమై ఉన్నారు. 58 పేతురు దూరం నుండి వెంబడిస్తూ, ప్రధాన యాజకుడి ఇంటి గుమ్మం వరకూ వచ్చి, లోపలికి వెళ్ళి ఏమి జరగబోతున్నదో చూడాలని అక్కడ ఉన్న సైనికులతో కలిసి కూర్చున్నాడు.
59 ముఖ్య యాజకులు, మహాసభ సభ్యులంతా యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా దొంగసాక్ష్యం కోసం వెదికారు. 60 అబద్ధ సాక్షులు చాలామంది వచ్చినా వారి సాక్ష్యం నిలబడలేదు. 61 చివరికి ఇద్దరు మనుషులు వచ్చి, “ఈ మనిషి దేవాలయాన్ని పడగొట్టి, మూడు రోజుల్లో దాన్ని తిరిగి కడతానని చెప్పాడు” అన్నారు. 62 అప్పుడు ప్రధాన యాజకుడు లేచి, “నీవు జవాబు చెప్పవేమిటి? వీరు నీకు వ్యతిరేకంగా పలికిన సాక్ష్యం విషయం ఏమంటావు?” అని అడిగాడు. యేసు మౌనం వహించాడు.
63 అందుకు ప్రధాన యాజకుడు ఆయనతో, “సజీవుడైన దేవుని నామంలో నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నీవు దేవుని కుమారుడు క్రీస్తువా? మాతో చెప్పు!” అన్నాడు. 64 అందుకు యేసు, “నీకై నీవే ఆ మాట చెప్పావు కదా. నేను చెప్పేదేమంటే, ఇక నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పక్కన కూర్చోవడమూ, ఆకాశ మేఘాల మీద ఆసీనుడై రావడమూ మీరు చూస్తారు” అన్నాడు. 65 వెంటనే ఆ ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకున్నాడు. “వీడు దేవదూషణ చేశాడు. అతని దేవదూషణ మీరే విన్నారు కదా, మనకింక సాక్షులతో పనేముంది? 66 మీరేమంటారు?” అని సభవారిని అడిగాడు. అందుకు వారు, “వీడు చావుకు తగినవాడు!” అన్నారు.
67 అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి, ఆయనను గుద్దారు. 68 కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, “క్రీస్తూ! నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు!” అన్నారు.
పేతురు అబద్ధాలు
మార్కు 14:66-72; లూకా 22:55-62
69 పేతురు బయట వసారాలో కూర్చుని ఉన్నాడు. ఒక పనిపిల్ల అతని దగ్గరికి వచ్చి, “నీవు గలిలయ వాడైన యేసుతో ఉన్నావు కదా?” అని అడిగింది. 70 అందుకు అతడు, “నీవు చెప్పే సంగతి నాకు తెలియదు” అని అందరి ముందూ అన్నాడు.
71 అతడు నడవలోకి వెళ్ళినపుడు మరొక పని పిల్ల అతణ్ణి చూసి, “ఇతడు కూడా నజరేతు వాడైన యేసుతో కలిసి ఉండేవాడు” అని అక్కడున్న వారితో చెప్పింది. 72 పేతురు మళ్ళీ ఒప్పుకోక ఈసారి ఒట్టు పెట్టుకుంటూ, “ఆ మనిషి ఎవరో నాకు తెలియదు” అన్నాడు.
73 కొంతసేపటి తరువాత అక్కడ నిలబడిన కొందరు పేతురు దగ్గరికి వచ్చి, “నిజమే, నువ్వు కూడా వారిలో ఒకడివే. నీ మాట్లాడే విధానం వల్ల అది తెలిసిపోతున్నది” అన్నారు. 74 దానితో పేతురు, “ఆ మనిషిని నేను ఎరగనే ఎరగను” అంటూ, ఒట్లు, శాపనార్ధాలూ పెట్టుకోవడం ప్రారంభించాడు. ఆ వెంటనే కోడి కూసింది.
75  “ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెబుతావు” అని యేసు తనతో చెప్పిన సంగతి జ్ఞాపకం చేసుకుని పేతురు బయటికి వెళ్ళి ఎంతో దుఃఖంతో పెద్దగా ఏడ్చాడు.