106
యెహోవాను స్తుతించండి. యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం ఉంటుంది.
యెహోవా పరాక్రమ కార్యాలను వర్ణించగలవాడెవడు? ఆయన కీర్తి అంతటినీ ఎవడు ప్రకటించగలడు?
న్యాయం అనుసరించేవారు, ఎల్లవేళలా నీతిననుసరించి నడుచుకునేవారు ధన్యులు.
యెహోవా, నీవు ఏర్పరచుకున్నవారి క్షేమం నేను చూస్తూ నీ ప్రజలకు కలిగే సంతోషాన్ని బట్టి నేను సంతోషిస్తూ,
నీ వారసత్వ ప్రజతో కలిసి కొనియాడేలా నీ ప్రజల పట్ల నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకానికి తెచ్చుకో. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించు.
మా పితరుల్లాగానే మేము పాపం చేశాము. దోషాలు మూటగట్టుకుని భక్తిహీనులమైపోయాము.
ఈజిప్టులో మా పూర్వీకులు నీ అద్భుతాలను గ్రహించలేదు. నీ కృపాబాహుళ్యం జ్ఞాపకం తెచ్చుకోలేదు. సముద్రం దగ్గర, ఎర్రసముద్రం దగ్గర వారు తిరుగు బాటు చేశారు.
అయినా తన మహా పరాక్రమాన్ని ప్రసిద్ధి చేయడానికి ఆయన తన నామాన్నిబట్టి వారిని రక్షించాడు.
ఆయన ఎర్రసముద్రాన్ని గద్దించగా అది ఆరిపోయింది. మైదానం మీద నడిచినట్టు ఆయన వారిని అగాధజలాల్లో నడిపించాడు.
10 పగవారి చేతిలోనుండి వారిని రక్షించాడు. శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించాడు.
11 నీళ్లు వారి శత్రువులను ముంచివేశాయి. వారిలో ఒక్కడైనా మిగల్లేదు.
12 అప్పుడు వారు ఆయన మాటలు నమ్మారు. ఆయన కీర్తిని గానం చేశారు.
13 అయినా వారు ఆయన కార్యాలను వెంటనే మర్చిపోయారు. ఆయన ఆలోచన కోసం కనిపెట్టుకోలేదు.
14 అరణ్యంలో వారు ఎంతో ఆశించారు. ఎడారిలో దేవుణ్ణి పరీక్షించారు.
15 వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడు. అయినా వారి ప్రాణాలకు ఆయన క్షీణత కలగజేశాడు.
16 వారు తమ శిబిరంలో మోషేపైనా యెహోవాకు ప్రతిష్ఠితుడు అహరోనుపైనా అసూయపడ్డారు.
17 భూమి నెర్రె విచ్చి దాతానును మింగేసింది. అది అబీరాము బృందాన్ని కప్పేసింది.
18 వారి మధ్యలో అగ్ని రగులుకుంది. దాని మంట భక్తిహీనులను కాల్చివేసింది.
19 హోరేబులో వారు దూడను చేయించుకున్నారు. పోత పోసిన విగ్రహానికి మొక్కారు.
20 తమ దేవుని మహిమను వారు గడ్డి మేసే ఎద్దు రూపానికి మార్చివేశారు.
21 ఈజిప్టులో గొప్ప కార్యాలను, హాము దేశంలో ఆశ్చర్యకార్యాలను
22 ఎర్రసముద్రం దగ్గర భయం గొలిపే క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు.
23 అప్పుడు ఆయన “నేను వారిని నశింపజేస్తాను” అన్నాడు. అయితే ఆయన వారిని నశింపజేయకుండేలా ఆయన కోపం చల్లార్చడానికి ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిలో నిలిచి అడ్డుపడ్డాడు.
24 రమ్యమైన దేశాన్ని వారు నిరాకరించారు. ఆయన మాట నమ్మలేదు.
25 యెహోవా మాట వినకుండా వారు తమ గుడారాల్లో సణుగుకున్నారు.
26 అప్పుడు అరణ్యంలో వారు కూలిపోయేలా చేయడానికి,
27 అన్యజనులలో వారి సంతానాన్ని కూల్చడానికి, దేశంలో వారిని చెదరగొట్టడానికి ఆయన వారిపై చెయ్యి ఎత్తాడు.
28 వారు బయల్పెయోరును హత్తుకుని, చచ్చిన వారికి అర్పించిన బలిమాంసాన్ని భుజించారు.
29 వారు తమ క్రియలచేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు చెలరేగింది.
30 ఫీనెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయింది.
31 నిత్యం తరాలన్నిటిలో అతనికి ఆ పని నీతిగా ఎంచబడింది.
32 మెరీబా జలాల దగ్గర వారు ఆయనకు కోపం పుట్టించారు. కాబట్టి వారి మూలంగా మోషేకు బాధ కలిగింది.
33 ఎలాగంటే వారు అతనికి విరక్తి పుట్టించారు. ఫలితంగా అతడు తొందరపడి మాట్లాడాడు.
34 యెహోవా వారికి ఆజ్ఞాపించినట్టు వారు అన్యజాతులను నాశనం చేయలేదు.
35 అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు.
36 వారి విగ్రహాలకు పూజ చేశారు. అవి వారికి ఉరి అయినాయి.
37 వారు తమ కొడుకులను, తమ కూతుళ్ళను దయ్యాలకు బలిగా అర్పించారు.
38 నిర్దోష రక్తం, అంటే తమ కొడుకుల రక్తం తమ కూతుళ్ళల రక్తం ఒలికించారు. కనాను జాతి వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించారు. ఆ రక్తం వలన దేశం అపవిత్రం అయిపోయింది.
39 తమ క్రియల వలన వారు అపవిత్రులైపోయారు. తమ నడవడిలో వ్యభిచారులయ్యారు.
40 కాబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద రగులుకుంది. ఆయన తన వారసత్వంపై అసహ్యపడ్డాడు.
41 ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించాడు. పగవారు వారిని ఏలారు.
42 శత్రువులు వారిని బాధపెట్టారు. వారు శత్రువుల చేతి కింద అణగారిపోయారు.
43 అనేక మార్లు ఆయన వారిని విడిపించాడు. అయినా వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేస్తూ వచ్చారు. తమ పాపం మూలంగా హీనదశకు వెళ్ళిపోయారు.
44 అయినా వారి రోదన తనకు వినబడగా వారికి కలిగిన బాధను ఆయన చూశాడు.
45 వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. తన నిబంధన విశ్వాస్యతను బట్టి వారిని కరుణించాడు.
46 వారిని చెరగొనిపోయిన వారికందరికీ వారంటే జాలి పుట్టించాడు.
47 యెహోవా మా దేవా, మమ్మల్ని రక్షించు. మేము నీ పరిశుద్ధనామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా, నిన్ను స్తుతిస్తూ మేము గర్వించేలా అన్యజనుల్లో నుండి మమ్మల్ని పోగుచెయ్యి.
48 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగయుగాలకూ స్తుతినొందు గాక. ప్రజలందరూ ఆమేన్‌ అందురు గాక. యెహోవాను స్తుతించండి.