ఆది. 5. ఆదాము వంశక్రమం ఇది. దేవుడు మనిషిని సృష్టించిన రోజున వాళ్ళను తన సొంత పోలికలో చేశాడు. వారిని పురుషులుగా, స్త్రీలుగా సృష్టించాడు. వాళ్ళను సృష్టించిన రోజున ఆయన వాళ్ళను ఆశీర్వదించి వాళ్లకు మనుషులు అని పేరు పెట్టాడు. ఆదాముకు నూట ముప్ఫై సంవత్సరాల వయస్సులో అతని పోలికగా అతని స్వరూపంలో కొడుకు పుట్టాడు. ఆదాము అతనికి షేతు అని పేరుపెట్టాడు. షేతు పుట్టిన తరువాత ఆదాము ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. ఆదాము తొమ్మిది వందల ముప్ఫై సంవత్సరాలు బ్రతికాడు. షేతుకు నూట ఐదు సంవత్సరాల వయస్సులో ఎనోషు పుట్టాడు. ఎనోషు పుట్టిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు. షేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికాడు. ఎనోషుకు తొంభై సంవత్సరాల వయస్సులో కేయినాను పుట్టాడు. కేయినాను పుట్టిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదిహేను సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు. ఎనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడు. కేయినానుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో మహలలేలు పుట్టాడు. మహలలేలు పుట్టిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలభై సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు. కేయినాను తొమ్మిది వందల పది సంవత్సరాలు బ్రతికాడు. మహలలేలుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో యెరెదు పుట్టాడు. యెరెదు పుట్టిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్ఫైసంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు. మహలలేలు ఎనిమిదివందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికాడు. యెరెదుకు నూట అరవై రెండు సంవత్సరాల వయస్సులో హనోకు పుట్టాడు. హనోకు పుట్టిన తరువాత యెరెదు ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు. యెరెదు తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు బ్రతికాడు. హనోకుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో మెతూషెల పుట్టాడు. మెతూషెల పుట్టిన తరువాత హనోకు మూడు వందల సంవత్సరాలు దేవునితో సహవాసం చేస్తూ కొడుకులను, కూతుళ్ళను కన్నాడు. హనోకు మూడువందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడు. హనోకు దేవునితో కలసి నడిచాడు. దేవుడు అతణ్ణి తీసుకువెళ్ళాడు గనుక అతడు కనబడలేదు. మెతూషెలకు నూట ఎనభై ఏడు సంవత్సరాల వయస్సులో లెమెకు పుట్టాడు. మెతూషెలకు లెమెకు పుట్టిన తరువాత ఏడు వందల ఎనభై రెండు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు. మెతూషెల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు. లెమెకుకు నూట ఎనభై రెండు సంవత్సరాల వయస్సులో ఒక కొడుకు పుట్టాడు. “భూమిని యెహోవా శపించినందువల్ల కలిగిన మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలో ఇతడు మనకు విశ్రాంతి ఇస్తాడు” అని, అతనికి నోవహు అని పేరు పెట్టాడు. లెమెకుకు నోవహు పుట్టిన తరువాత ఐదు వందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు. లెమెకు ఏడువందల డెబ్భై ఏడు సంవత్సరాలు బ్రతికాడు. ఐదు వందల సంవత్సరాలు బ్రతికిన నోవహుకు షేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు.