ఆది. 36. ఎదోము అనే మారు పేరు గల ఏశావు వంశావళి ఇది. ఏశావు హిత్తీయుడైన ఏలోను కూతురు ఆదా, హివ్వీయుడైన సిబ్యోను కూతురైన అనా కూతురు అహోలీబామా, ఇష్మాయేలు కూతురు, నెబాయోతు సోదరి అయిన బాశెమతు అనే కనాను యువతులను పెళ్ళి చేసుకున్నాడు. ఏశావుకు ఆదా ఎలీఫజును, బాశెమతు రగూయేలును కన్నారు. అహోలీబామా యూషును, యాలామును, కోరహును కన్నది. వీరు కనాను దేశంలో ఏశావుకు పుట్టిన కొడుకులు. ఏశావు తన భార్యలనూ కుమారులనూ కూతుళ్ళనూ తన ఇంటివారందరినీ తన మందలనూ పశువులనూ తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి అంతటినీ తీసుకుని తన తమ్ముడైన యాకోబు నుండి దూరంగా మరొక దేశానికి వెళ్ళిపోయాడు. వారు విస్తారమైన సంపద గలవారు కాబట్టి వారు కలిసి నివసించలేక పోయారు. వారి పశువులు అధికంగా ఉండడం వలన వారు నివసించే స్థలం వారిద్దరికీ సరిపోలేదు. కాబట్టి ఏశావు శేయీరు కొండ ప్రాంతంలో నివసించాడు. ఏశావుకు మరొక పేరు ఎదోము. శేయీరు కొండ ప్రాంతంలో నివసించిన ఎదోమీయుల మూల పురుషుడైన ఏశావు వంశావళి ఇది. ఏశావు కొడుకుల పేర్లు, ఏశావు భార్య ఆదా కొడుకు ఎలీఫజు, మరొక భార్య బాశెమతు కొడుకు రగూయేలు. ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. ఎలీఫజు ఉపపత్ని తిమ్నా. ఆమె కొడుకు అమాలేకు. వీరంతా ఏశావు భార్య అయిన ఆదాకు మనుమలు. రగూయేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్య అయిన బాశెమతుకు మనుమలు. ఏశావుకున్న మరొక భార్య సిబ్యోను కూతురు అయిన అనా కూతురు అహొలీబామా. ఈమె ఏశావుకు కన్న కొడుకులు యూషు, యాలాము, కోరహు. ఏశావు కొడుకుల్లో తెగల నాయకులు ఎవరంటే, ఏశావు మొదటి సంతానమైన ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, కనజు, కోరహు, గాతాము, అమాలేకు. వీరు ఎదోము దేశంలో ఎలీఫజు నుండి వచ్చిన నాయకులు. వీరు ఏశావు భార్య ఆదాకు మనుమలు. ఏశావు కొడుకైన రగూయేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఎదోము దేశంలో రగూయేలు నుండి వచ్చిన నాయకులు. వీరు ఏశావు భార్య బాశెమతు మనుమలు. ఇక ఏశావు భార్య, అనా కూతురు అయిన అహొలీబామా కొడుకులు యూషు, యగ్లాము, కోరహు. వీరు అహొలీబామా పుత్రసంతానపు నాయకులు. వీరంతా ఎదోము అనే ఏశావు కొడుకులు, వారి వారి సంతానపు తెగల నాయకులు. ఎదోము దేశంలో ఆదినుండీ నివసించిన హోరీయుడైన శేయీరు కొడుకులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దీషాను. వీరు ఎదోము దేశంలోని శేయీరు కొడుకులైన హోరీయుల నాయకులు. లోతాను కొడుకులు హోరీ, హేమాను. లోతాను సోదరి తిమ్నా. శోబాలు కొడుకులు అల్వాను, మానహదు, ఏబాలు, షపో, ఓనాము. సిబ్యోను కొడుకులు అయ్యా, అనా అనేవారు. ఈ అనా తన తండ్రి సిబ్యోనుకు చెందిన గాడిదలను మేపుతూ ఉండగా మొదటి సారిగా అరణ్యంలో ఉష్ణధారలు కనుగొన్నాడు. అనా కొడుకు దిషోను, కూతురు అహొలీబామా. దిషోను కొడుకులు హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను, ఏసెరు కొడుకులు బిల్హాను, జవాను, అకాను. దీషాను కొడుకులు ఊజు, అరాను. హోరీయుల నాయకులు ఎవరంటే, లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దీషాను. శేయీరు దేశంలోని వారి నాయకుల జాబితా ప్రకారం వీరు హోరీయుల నాయకులు. ఇశ్రాయేలీయుల మీద ఏ రాజూ పరిపాలన చేయక ముందే, ఎదోమును పరిపాలించిన రాజులు ఎవరంటే, బెయోరు కొడుకు బెల ఎదోములో పాలించాడు. అతని ఊరు దిన్హాబా. బెల చనిపోయిన తరువాత బొస్రావాడైన జెరహు కొడుకు యోబాబు రాజయ్యాడు. యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశస్థుడు హుషాము రాజయ్యాడు. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన బదదు కొడుకు హదదు రాజయ్యాడు. అతని ఊరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మశ్రేకా వాడైన శమ్లా రాజయ్యాడు. శమ్లా చనిపోయిన తరువాత నదీతీర ప్రాంతమైన రహెబోతుకు చెందిన షావూలు రాజయ్యాడు. షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కొడుకు బయల్‌ హానాను రాజయ్యాడు. అక్బోరు కొడుకు బయల్‌ హానాను చనిపోయిన తరువాత హదరు రాజయ్యాడు. అతని ఊరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు మనుమరాలు అయిన మత్రేదు కూతురు. వారివారి తెగల ప్రకారం వారివారి ప్రాంతాల్లో వారివారి పేర్ల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేర్లు ఏవంటే, తిమ్నా, అల్వా, యతేతు, అహొలీబామా, ఏలా, పీనోను, కనజు, తేమాను, మిబ్సారు, మగ్దీయేలు, ఈరాము. వీరంతా తమ తమ స్వాధీనంలో ఉన్న దేశంలో తమతమ నివాస స్థలాల ప్రకారం ఎదోము నాయకులు. ఎదోమీయులకు మూల పురుషుడు ఏశావు.