యోబు. 4. అందుకు తేమానీయుడు ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు. ఎవరైనా ఈ విషయం గురించి నీతో మాట్లాడితే నీకు చిరాకు కలుగుతుందా? అయితే నీతో మాట్లాడకుండా నిదానంగా ఎవరు ఉంటారు? నువ్వు చాలా మందికి బుద్ధినేర్పించావు. అనేకమంది నిస్సహాయులను బలపరిచావు. దారి తప్పిన వాళ్ళను నీ మాటలతో ఆదుకున్నావు. మోకాళ్లు సడలిన వాళ్ళను బలపరిచావు. అయితే ఇప్పుడు నీకు కష్టం కలిగినప్పుడు దుఃఖంతో అల్లాడుతున్నావు. నీకు కలిగిన కష్టం వల్ల తల్లడిల్లిపోతున్నావు. నీకున్న భక్తి నీలో ధైర్యం కలిగించదా? నిజాయితీ గల ప్రవర్తన నీ ఆశాభావానికి ఆధారం కాదా? జ్ఞాపకం చేసుకో, నీతిమంతుడు ఎప్పుడైనా నాశనం అయ్యాడా? నిజాయితీపరులు ఎక్కడైనా తుడిచి పెట్టుకుపోయారా? నాకు తెలిసినంత వరకు దుష్టత్వాన్ని దున్ని, కీడు అనే విత్తనాలు చల్లే వాళ్ళు ఆ పంటనే కోస్తారు. దేవుడు గాలి ఊదినప్పుడు వాళ్ళు నశించిపోతారు. ఆయన కోపాగ్ని రగిలినప్పుడు వాళ్ళు లేకుండాా పోతారు. సింహాల గర్జనలు, క్రూరసింహాల గాండ్రింపులు ఆగిపోతాయి. కొదమసింహాల కోరలు విరిగిపోతాయి. తిండి లేకపోవడం చేత ఆడ సింహాలు నశించిపోతాయి. సింహపు కూనలు చెల్లాచెదరైపోతాయి. నాకొక రహస్యం తెలిసింది. ఒకడు గుసగుసలాడుతున్నట్టు అది నా చెవికి వినబడింది. మనుషులకు రాత్రివేళ గాఢనిద్ర పట్టే సమయంలో వచ్చే కలవరమైన కలలో అది వచ్చింది. నాకు భయం వణుకు కలిగింది. అందువల్ల నా ఎముకలన్నీ వణికిపోయాయి. ఒకడి ఊపిరి నా ముఖానికి తగిలింది. నా శరీరం పై వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి. ఒక రూపం నా కళ్ళెదుట నిలిచింది. నేను దాన్ని గుర్తు పట్టలేకపోయాను. మెల్లగా వినిపించే ఒక స్వరం విన్నాను. ఆ స్వరం “దేవుని సన్నిధిలో అపవిత్రులు నీతిమంతులవుతారా? తమ సృష్టికర్త ఎదుట ఒకడు పవిత్రుడౌతాడా?” అంటుంది. తన సేవకుల పట్ల ఆయనకు నమ్మకం పోయింది. తన దూతల్లోనే ఆయన తప్పులు వెతుకుతున్నాడు. అలాంటిది బంకమట్టి ఇళ్ళలో నివసించే వాళ్ళలో, మట్టిలో పుట్టిన వాళ్ళలో, చిమ్మెట చితికిపోయేలా చితికిపొయే వాళ్ళలో ఇంకెన్ని తప్పులు ఆయన చూస్తాడు! ఉదయం నుండి సాయంత్రం మధ్యకాలంలో వాళ్ళు ముక్కలైపోతారు. ఎవరూ గుర్తించకుండానే వాళ్ళు శాశ్వతంగా నాశనమైపోతారు. వాళ్ళ డేరాల తాళ్ళు పెరికివేస్తారు. వాళ్ళు బుద్ధి తెచ్చుకోకుండానే మరణమైపోతారు. నేడు ఆ విధంగానే జరుగుతుంది గదా.