యోబు. 41. నువ్వు జలరాక్షసిని గాలంతో లాగగలవా? దాని దవడలను తాడుతో బిగించగలవా? నువ్వు దాని ముక్కుకు పగ్గం వేయగలవా? దాని దవడకు కొంకి ఎక్కించగలవా? అది నీకు విన్నపాలు చేస్తుందా? మృదువైన మాటలు నీతో పలుకుతుందా? నువ్వు శాశ్వతంగా దాన్ని సేవకుడుగా చేసుకునేలా అది నీతో ఒప్పందం చేస్తుందా? నువ్వు ఒక పిట్టతో ఆటలాడినట్టు దానితో ఆటలాడతావా? నీ పనిపిల్లలు ఆడుకోడానికి దాని కట్టివేస్తావా? బెస్తవాళ్ళు దానితో బేరాలు చేస్తారా? వారు దాన్ని తునకలు చేసి వర్తకులతో వ్యాపారం చేస్తారా? దాని ఒంటినిండా ఇనప శూలాలు గుచ్చగలవా? దాని తలనిండా చేప అలుగులు గుచ్చగలవా? దాని మీద చెయ్యి వేసి చూడు, దానితో కలిగే పోరు నువ్వు గుర్తు చేసుకుంటే నువ్వు మళ్ళీ అలా చెయ్యవు. దాన్ని చూస్తే చాలు, మనుషులు దాన్ని వశపరచుకోవచ్చనే ఆశ వదులుకుంటారు. దాని చూస్తే చాలు ఎవరికైనా గుండెలు అవిసిపోతాయి. సముద్ర రాక్షసిని రేపడానికి తెగించే శూరుడు లేడు. అలా ఉండగా నా ఎదుట నిలవగలవాడెవడు? నేను తిరిగి చెల్లించేలా నాకెవరైనా ఏమైనా ఇచ్చారా? ఆకాశం కింద ఉన్నదంతా నాదే గదా. సముద్ర రాక్షసి కాళ్ళను గురించైనా దాని మహా బలాన్ని గురించైనా దాని చక్కని ఆకారాన్ని గురించైనా పలకకుండా మౌనంగా ఉండను. ఎవడైనా దాని పై పొరలను లాగివేయగలడా? దాని రెండు కవచాలను గుచ్చి రంధ్రం చేయగలడా? దాని భయంకరమైన కోరలు ఉన్న ముఖ ద్వారాలను తెరవగల వాడెవడు? దాని వీపుకు దృఢమైన పొలుసులు అతికి ఉన్నాయి. విడదీయలేనంత గట్టిగా అవి కూర్చి ఉన్నాయి. అవి ఒకదానితో ఒకటి హత్తుకుని ఉన్నాయి. వాటి మధ్యకు గాలి ఏమాత్రం చొరబడదు. అవి ఒకదానితో ఒకటి అతికి ఉన్నాయి. వాటిని ఛేదించడం ఎవరివల్లా కాదు. అది తుమ్మితే వెలుగు చిమ్ముతుంది. దాని కళ్ళు ఉదయకాలపు కనురెప్పల్లాగా ఉన్నాయి. దాని నోటి నుండి మండే నిప్పులు బయలుదేరుతాయి. అగ్ని కణాలు దాని నుండి లేస్తాయి. పొయ్యిపై మసులుతున్న కాగులోనుండి, బాగా గాలి విసిరి రాజబెట్టిన మంటలోనుండి లేచినట్టు దాని నాసికా రంధ్రాల్లో నుండి పొగ లేస్తుంది. దాని ఊపిరి నిప్పులను మండిస్తుంది. దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరుతాయి. దాని మెడలో బలముంది. భయం దాని ఎదుట తాండవమాడుతూ ఉంటుంది. దాని దళసరి కండరాలు గట్టిగా అతికి ఉన్నాయి. అవి దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నాయి. అవి ఊడి రావు. దాని గుండె రాయి లాగా గట్టిగా ఉంది. అది తిరగలి కింది దిమ్మంత కఠినం. అది లేచేటప్పుడు మహామహులు సైతం భయపడతారు. భయంతో వారు వెనక్కి తగ్గుతారు. కత్తి దెబ్బ దాన్ని ఏమీ చెయ్యదు. ఈటె, బాణం, పదునైన ఏ అయుధమైనా పనికి రావు. అది ఇనుమును గడ్డిపోచగా, ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగా చూస్తుంది. బాణం దాన్ని తరిమి కొట్టలేదు. వడిసెల రాళ్లు దాని దృష్టికి పొట్టులాగా ఉన్నాయి. గదలను అది గడ్డిపరకలుగా ఎంచుతుంది. అది రివ్వున ఎగిరి వచ్చే ఈటెను చూసి నవ్వుతుంది. దాని ఉదర భాగాలు కరుకైన గాజు పెంకుల్లాగా ఉన్నాయి. అది బురద మీద నురిపిడి కొయ్యలాంటి తన తోకను పరచుకుంటుంది. కాగులో నీళ్ళు మసిలినట్టు మహాసముద్రాన్ని అది పొంగిస్తుంది. సముద్రాన్ని అది నూనెలాగా చేస్తుంది. అది తాను నడచిన దారిని తన వెనక ప్రకాశింప జేస్తుంది. చూసే వారు అగాధ జలం తెల్లగా ఉంది అనుకుంటారు. అది నిర్భయంగా జీవిస్తుంది. భూమి మీద దానికి సమానమైనది లేదు. అది గర్వంగా ఉండే వాటిని తిరస్కారంగా చూస్తుంది. గర్వించే వాటన్నిటికీ అది రాజు.