కీర్తన. 20. ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన ఆపద సమయంలో యెహోవా నీకు జవాబిస్తాడు గాక. యాకోబు దేవుని నామం నిన్ను కాపాడుతుంది గాక. పరిశుద్ధ స్థలంలోనుంచి ఆయన నీకు సహాయం చేస్తాడు గాక. సీయోనులోనుంచి నిన్ను ఆదుకుంటాడు గాక. ఆయన నీ అర్పణలు జ్ఞాపకం చేసుకుని, నీ దహన బలులు అంగీకరిస్తాడు గాక. నీ హృదయవాంఛను తీర్చి నీ ప్రణాళికలన్నీ నెరవేరుస్తాడు గాక. అప్పుడు నీ రక్షణను బట్టి మేము ఆనందిస్తాము. దేవా, నీ పేరట జెండా ఎత్తుతాము. నీ అభ్యర్ధనలన్నీ యెహోవా మంజూరు చేస్తాడు గాక. యెహోవా తన అభిషిక్తుణ్ణి రక్షిస్తాడని నాకిప్పుడు తెలిసింది. రక్షించగల తన కుడిచేతి బలంతో తన పవిత్రాకాశంలోనుంచి అతనికి జవాబిస్తాడు. కొందరు రథాలను, కొందరు గుర్రాలను నమ్ముకుంటారు. కాని మనం మన దేవుడైన యెహోవాకు మొర పెడతాము. వాళ్ళు కుంగి నేల మీద పడిపోతారు, మనం లేచి తిన్నగా నిలిచి ఉంటాము! యెహోవా, రాజును రక్షించు. మేము మొరపెట్టినప్పుడు మాకు సహాయం చెయ్యి.