కీర్తన. 64. ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన దేవా, నేను మొర పెట్టినప్పుడు నా మనవి విను. నా శత్రువుల భయం నుండి నా ప్రాణాన్ని కాపాడు. దుర్మార్గుల కుట్ర నుండి, దుష్టక్రియలు చేసేవారి అల్లరి నుండి నన్ను దాచిపెట్టు. ఒకడు కత్తికి పదునుపెట్టేలా వారు తమ నాలుకలకు పదును పెడతారు. చేదు మాటలు అనే బాణాలను వారు ఎక్కుపెట్టారు. నిరపరాధులను కొట్టాలని రహస్య స్థలాల్లో ఆ బాణాలు సంధిస్తారు. ఏమాత్రం భయపడకుండా వారు అకస్మాత్తుగా వారిని కొడతారు. వారు దురాలోచనలు చేస్తూ తమను తాము ప్రోత్సాహ పరచుకుంటారు. చాటుగా వల పన్నడానికి ఆలోచిస్తారు. మనలను ఎవరు చూస్తారులే అని చెప్పుకుంటారు. వారు చెడ్డపనులు చేయడానికి కొత్త ప్రణాళికలు తయారు చేస్తారు. ఇది మంచి పన్నాగం, చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేశాం అని వారు చెప్పుకుంటారు. మానవుని హృదయంలోని ఆలోచనలు చాలా లోతైనవి. దేవుడు వారిని బాణాలతో కొడతాడు. ఉన్నట్టుండి వారు గాయాల పాలవుతారు. వారు కూలిపోతారు. దానికి కారణం వారి నాలుకలే. వారిని చూసిన వారంతా తలలు ఊపుతారు. మనుషులంతా భయం కలిగి దేవుడు చేసిన పనులు ప్రకటిస్తారు. ఆయన కార్యాలను గూర్చి చక్కగా ఆలోచిస్తారు. నీతిపరులు యెహోవాను బట్టి సంతోషిస్తూ ఆయనలో ఆశ్రయం పొందుతారు. యథార్థవంతులు ఆయనలో గర్విస్తారు.