కీర్తన. 114. ఈజిప్టులోనుండి ఇశ్రాయేలు, విదేశీ జాతుల్లోనుండి యాకోబు వెళ్లిపోయినప్పుడు, యూదా ఆయనకు పరిశుద్ధస్థలం అయింది. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం అయింది. సముద్రం దాన్ని చూసి పారిపోయింది. యొర్దాను నది వెనక్కి మళ్ళింది. పర్వతాలు పొట్టేళ్లలాగా, కొండలు గొర్రెపిల్లల్లాగా గంతులు వేశాయి. ఓ సముద్రం, పారిపోయావేమిటి? యొర్దానూ, నీవు వెనక్కి మళ్లావేమిటి? పర్వతాల్లారా, మీరు పొట్లేళ్లలాగానూ కొండల్లారా, మీరు గొర్రెపిల్లల్లాగానూ కుప్పిగంతులు వేశారెందుకు? భూమీ, ప్రభువు సన్నిధిలో, యాకోబు దేవుని సన్నిధిలో వణకు. ఆయన బండరాతిని నీటిమడుగుగా, చెకుముకి రాతి శిలను నీటి ఊటలుగా చేశాడు.