కీర్తన. 123. యాత్రల కీర్తన పరలోకంలో సింహాసనంపై ఆసీనుడై ఉన్నవాడా, నా కన్నులెత్తి నీ వైపు చూస్తున్నాను. సేవకుల కళ్ళు తమ యజమాని చేతి వైపు, దాసి కళ్ళు తన యజమానురాలి చేతి వైపు చూస్తాయి. అలాగే దేవుడైన యెహోవా మనపై కరుణ చూపించేదాకా మన కళ్ళు ఆయనవైపు చూస్తున్నాయి. యెహోవా, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కరుణించు. మేము తీవ్ర తిరస్కారానికి గురయ్యాము. అలగాజనం వేసే నిందలతో, గర్విష్ఠుల తిరస్కారాలతో మేము నిండిపోయాము.