సామెత. 11. దొంగ త్రాసు యెహోవాకు అసహ్యం. న్యాయమైన తూకం ఆయనకు ఇష్టం. గర్వం వెనకాలే అవమానం బయలు దేరుతుంది. జ్ఞానం గలవారు వినయ విధేయతలు కలిగి ఉంటారు. నిజాయితీ గల వారిని వారి న్యాయబుద్ధి నడిపిస్తుంది. దుర్మార్గుల మూర్ఖత్వం వారిని చెడగొడుతుంది. దేవుని ఉగ్రత దినం వచ్చినప్పుడు ఆస్తిపాస్తులు ఉపయోగపడవు. నీతిమంతులు మరణం నుండి తప్పించు కుంటారు. యథార్థవంతుల న్యాయ ప్రవర్తన వారి మార్గాన్ని సరళం చేస్తుంది. దుష్టులు తమ దుర్మార్గ క్రియలవల్ల కూలిపోతారు. నిజాయితీపరుల మంచితనం వారికి విడుదల కలిగిస్తుంది. ద్రోహులు తమ దురాశ చేత చిక్కుల్లో పడతారు. దుష్టుడు చనిపోయినప్పుడు వాడి ఆశాభావం అంతరించిపోతుంది. బలవంతుడి కోరికలు భగ్నమైపోతాయి. ఉత్తముడు కష్టాల నుండి విడుదల పొందుతాడు. మూర్ఖులు కష్టాలు కొనితెచ్చుకుంటారు. మూర్ఖుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనం కలిగిస్తాడు. నీతిమంతులు తమ తెలివి ఉపయోగించి తప్పించుకుంటారు. నీతిమంతులు దీవెన పొందడం పట్టణానికి శుభదాయకం. దుర్మార్గులు నాశనమైతే ఆనంద ధ్వనులు మోగుతాయి. నీతిమంతులు దీవెనలు పొందితే పట్టణం ఉన్నత స్థితికి చేరుతుంది. దుష్టుల మాటలు దాన్ని కూలిపోయేలా చేస్తాయి. తన పొరుగువాణ్ణి కించపరిచేవాడు జ్ఞానహీనుడు. వివేకం గల వాడు మౌనం వహిస్తాడు. చాడీలు చెబుతూ తిరిగేవాడు ఇతరుల గుట్టు బయటపెడతాడు. నమ్మకస్థుడు రహస్యాలు దాస్తాడు. మార్గదర్శకులు లేకపోతే ప్రజలు నాశనం అవుతారు. సలహాలిచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉండడం ప్రజలకు క్షేమకరం. పరాయివాడి కోసం హామీ ఉన్నవాడు కష్టాలపాలవుతాడు. హామీ ఉండని వాడు భయం లేకుండా ఉంటాడు. మృదు స్వభావం గల స్త్రీని అందరూ కీర్తిస్తారు. బలం గలవారు సంపద చేజిక్కుంచుకుంటారు. దయగలవాడు చేసే మంచి పనులు అతనికి మేలు చేస్తాయి. దుష్టుడు తన దుష్ట కార్యాలవల్ల తన శరీరానికి ఆపద తెచ్చుకుంటాడు. దుష్టుల సంపద వాళ్ళను మోసపరుస్తుంది. నీతి అనే విత్తనం నాటేవాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు. వాస్తవమైన నీతి జీవానికి మూలం. అదే పనిగా చెడ్డ కార్యాలు చేసేవాడు తన మరణానికి దగ్గరౌతాడు. మూర్ఖులైన దుష్ట ప్రజలు యెహోవాకు అసహ్యులు. యథార్థవంతులను ఆయన ప్రేమిస్తాడు. భక్తిహీనులకు తప్పకుండా శిక్ష పడుతుంది. నీతిమంతుల సంతతి విడుదల పొందుతారు. స్త్రీ ఎంత అందంగా ఉన్నప్పటికీ ఆమెకు వివేకం లేకపోతే ఆ స్త్రీ పంది ముక్కుకు తొడిగిన బంగారు ముక్కుపుడకతో సమానం. నీతిమంతులు ఉత్తమమైన వాటినే కోరుకుంటారు. దుష్టుల ఆశలు అహంకార పూరితం. ధారాళంగా ఇచ్చి అభివృద్ధి పొందిన వారు ఉన్నారు. తక్కువ ఇచ్చి దరిద్రులైన వారు కూడా ఉన్నారు. ఔదార్యం చూపేవారు వర్ధిల్లుతారు. నీళ్లు పోసేవాడికి నీళ్లు పోస్తారు. ధాన్యం అక్రమంగా నిల్వ చేసే వాణ్ణి ప్రజలు శపిస్తారు. దాన్ని సక్రమంగా అమ్మే వాడికి దీవెనలు కలుగుతాయి. మేలు చేయాలని కోరేవాడు ఉపయోగకరమైన పనులు చేస్తాడు. కీడు చేయాలని కోరుకునే వాడికి కీడే కలుగుతుంది. సంపదను నమ్ముకున్నవాడు చెదిరిపోతాడు. నీతిమంతులు చిగురుటాకుల వలే వృద్ధి చెందుతారు. తన ఇంటివారిని బాధపెట్టేవాడు గాలికి చెదిరి పోతాడు. వివేకం లేనివాడు జ్ఞానం గలవాడికి సేవకుడు అవుతాడు. నీతిమంతులు జీవ వృక్ష ఫలాలు ఫలిస్తారు. జ్ఞానవంతులు ఇతరులను రక్షిస్తారు. నీతిమంతులు ఈ లోకంలో తగిన ప్రతిఫలం పొందుతారు. అలాగే, దుష్టులకు, పాపులకు తప్పనిసరిగా తగిన ప్రతిఫలం కలుగుతుంది గదా.