ప్రసంగి. 4. ఆ తరవాత సూర్యుని కింద జరుగుతున్న వివిధ రకాల అన్యాయాలను గురించి నేను ఆలోచించాను. బాధలు పడేవారు కన్నీరు కారుస్తున్నారు. వారికి ఆదరణ లేదు. వారిని అణచి వేసే వారు బలవంతులు కాబట్టి వారిని ఆదరించేవారెవరూ లేరు. కాబట్టి ఇప్పుడు జీవిస్తున్న వారి కంటే గతించిపోయిన వారే ధన్యులు అనుకున్నాను. ఇంకా పుట్టని వారు సూర్యుని కింద జరుగుతున్న ఈ అక్రమాలను చూడలేదు కాబట్టి ఈ ఇద్దరి కంటే వారు ఇంకా ధన్యులు అనుకున్నాను. కష్టంతో, నైపుణ్యంగా చేసే ప్రతి పనీ వేరొకరి అసూయకి కారణం అవుతున్నదని నేను చూశాను. ఇది కూడా నిష్ప్రయోజనంగా, ఒకడు గాలిని పట్టుకోడానికి చేసే ప్రయత్నంలాగా ఉంది. బుద్ధిహీనుడు పని చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడం వల్ల తనను తనే నాశనం చేసుకుంటున్నాడు. రెండు చేతులతో కష్టం, గాలి కోసం ప్రయత్నాలు చేసేకంటే ఒక చేతిలో నెమ్మది కలిగి ఉండడం మంచిది. నేను ఆలోచిస్తున్నపుడు సూర్యుని కింద నిష్ప్రయోజనమైంది ఇంకొకటి కనిపించింది. ఒకడు ఒంటరిగా ఉన్నాడు. అతనికి జతగాడు గాని, కొడుకు గాని, సోదరుడు గాని లేడు. అయినా అతడు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు. ఐశ్వర్యం అతనికి తృప్తి కలిగించదు. సుఖమనేది లేకుండా ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నాను అనుకుంటాడు. ఇది కూడా ఆవిరిలాగా నిష్ప్రయోజనం, విచారకరం. ఇద్దరు కష్టపడితే ఇద్దరికీ మంచి జరుగుతుంది. కాబట్టి ఒంటరిగా కంటే ఇద్దరు కలిసి ఉండడం మంచిది. ఒకడు కింద పడినా మరొకడు లేపుతాడు. అయితే ఒక్కడే ఉంటే అతడు పడినప్పుడు లేపేవాడు లేనందువలన అతనికి కష్టమే మిగులుతుంది. ఇద్దరు కలిసి పండుకొంటే వారికి వెచ్చగా ఉంటుంది. ఒక్కడే ఉంటే వీలు కాదు కదా! ఒంటరిగా ఉన్నవాణ్ణి పడదోయడం తేలిక. అయితే ఇద్దరు కలిసి ఉంటే తమపై దాడిని ఎదుర్కోగలరు. మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు గదా? మంచి హెచ్చరికలు వినడానికి ఇష్టం లేని మూర్ఖుడైన ముసలి రాజుకంటే జ్ఞానవంతుడైన ఒక చిన్న పిల్లవాడు శ్రేష్ఠుడు. అలాంటివాడు తన దేశంలో బీదవాడుగా పుట్టినా, చెరసాలలో ఉన్నా రాజుగా పట్టాభిషేకం పొందుతాడు. సూర్యుని కింద జీవిస్తూ తిరిగే వారంతా చనిపోయిన రాజుకు బదులు రాజైన ఆ చిన్నవాని పక్షం వహిస్తారని నేను గ్రహించాను. ప్రతి ఒక్కరూ అతనికి విధేయత చూపడానికి వస్తారు. అయితే ఆ తరవాత వారిలో అనేకమంది అతనిపై ఇష్టం చూపరు. నిజానికి ఇది కూడా నిష్ప్రయోజనమే, ఒకడు గాలిని పట్టుకోడానికి ప్రయత్నించినట్టే.