పరమ. 8. (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) నా తల్లి పాలు తాగిన నా సోదరునిలా నువ్వు నాకుంటే ఎంత బాగు! అప్పుడు నువ్వు బయట ఎదురు పడితే నీకు ముద్దులిచ్చేదాన్ని. అప్పుడు నన్నెవరూ నిందించరు. నేను నిన్ను మా పుట్టింటికి తీసుకెళ్తాను. నువ్వు నాకు పాఠాలు నేర్పిస్తావు. తాగడానికి నీకు సుగంధ ద్రాక్షారసాన్ని, నా దానిమ్మ పళ్ళ రసాన్ని ఇస్తాను. (యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది). అతని ఎడమచెయ్యి నా తల కింద ఉంది. అతని కుడిచేత్తో నన్ను ఆలింగనం చేసుకున్నాడు (యువతి ఇతర స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) యెరూషలేము ఆడపడుచులారా, మీచేత ఒట్టు వేయించుకుంటున్నాను. మా ప్రేమ పని ముగిసేంత వరకూ మీరు మమ్మల్ని ఆటంకపరచవద్దు. ఆరవ భాగం-ముగింపు (యెరూషలేము స్త్రీలు మాట్లాడుతున్నారు) తన ప్రియుని మీద ఆనుకుని ఎడారి దారిలో వచ్చేది ఎవరు? (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) ఆపిల్ చెట్టు కింద నువ్వు పడుకుని ఉంటే నేను నిన్ను లేపాను. అక్కడ నువ్వు మీ అమ్మ కడుపులో పడ్డావు. ఆమె నిన్ను అక్కడే ప్రసవించింది. నీ చేతిమీదున్న పచ్చబొట్టులా నీ గుండె మీద నా పచ్చబొట్టు పొడిపించుకో. ఎందుకంటే ప్రేమకు చావుకున్నంత బలముంది. మోహం పాతాళంతో సమానమైన తీవ్రత గలది. దాని మంటలు ఎగిసి పడతాయి. అది మండే అగ్నిజ్వాల. ఏ అగ్ని మంటలకన్నా అది తీవ్రమైనది. ఉప్పెన కూడా ప్రేమను ఆర్పలేదు. వరదలు దాన్ని ముంచలేవు. ప్రేమ కోసం ఎవడైనా తనకున్నదంతా ఇచ్చేసినా ఆ ప్రయత్నం శుద్ధ దండగ. (ఆ యువతి సోదరులు తమలో తాము మాట్లాడుకుంటున్నారు). మాకొక చిన్నారి చెల్లి ఉంది. ఆమె స్తనాలు ఇంకా పెరగలేదు. ఆమె నిశ్చితార్థం రోజున మా చెల్లి కోసం మేమేం చెయ్యాలి? ఆమె గోడలాంటిదైతే దానిమీద వెండి గోపురం కట్టిస్తాం. ఆమె తలుపులాంటిదైతే దేవదారు చెక్కతో దానికి గడులు పెడతాం. (యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.) నేను గోడలా ఉండేదాన్ని. అయితే ఇప్పుడు నా స్తనాలు గోపురాల్లా ఉన్నాయి. కాబట్టి నేను పూర్తిగా అతని దృష్టికి సిద్ధంగా ఉన్నా. బయల్ హామోనులో సొలొమోనుకు ఒక ద్రాక్షావనం ఉంది. అతడు దాన్ని రైతులకు కౌలుకిచ్చాడు. ప్రతి రైతూ వెయ్యి వెండి నాణాలు కౌలు చెల్లించాలి. నా ద్రాక్షతోట నా సొంతం. సొలొమోనూ, ఆ వెయ్యి వెండి నాణాలు నీవే. దాన్ని కౌలు చేసేవారికి రెండు వందల నాణాలు గిట్టుతాయి. (ఆ యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతున్నాడు) ఉద్యానవనంలో పెరిగేదానా, నా మిత్రులు నీ స్వరం వింటున్నారు. నన్నూ విననీ. (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) ప్రియా, త్వరగా వచ్చెయ్యి. జింకలా, లేడిపిల్లలా సుగంధ పర్వతాల మీదుగా చెంగు చెంగున వచ్చెయ్యి.