యెషయా. 38. ఆ రోజుల్లో హిజ్కియాకు ప్రాణాంతకమైన జబ్బు చేసింది. ప్రవక్త, ఆమోజు కొడుకు యెషయా అక్కడకు వచ్చాడు. “‘నువ్వు చనిపోబోతున్నావు, ఇక బతకవు. కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో’ అని యెహోవా సెలవిస్తున్నాడు” అని చెప్పాడు. అప్పుడు హిజ్కియా గోడవైపు తిరిగి, “యెహోవా, యథార్థ హృదయంతో, సత్యంతో నీ సన్నిధిలో నేనేవిధంగా జీవించానో, సమస్తాన్నీ ఏ విధంగా నీ దృష్టికి మంచిదిగా జరిగించానో, కృపతో జ్ఞాపకం చేసుకో” అని కన్నీళ్ళతో యెహోవాను ప్రార్థించాడు. అప్పుడు యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు, “నువ్వు తిరిగి హిజ్కియా దగ్గరికి పోయి అతనితో ఇలా చెప్పు, ‘నీ పూర్వికుడైన దావీదు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చేదేమంటే నీ కన్నీళ్లు నేను చూశాను. నీ ప్రార్థన అంగీకరించాను. నీ జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్షు పెంచుతాను. నిన్ను, ఈ పట్టణాన్ని అష్షూరు రాజు చేతి నుండి విడిపించి కాపాడతాను. తాను పలికిన మాట నెరవేరుతుంది అనడానికి యెహోవా నీకిచ్చే సూచన ఇదే, ఆహాజు ఎండ గడియారం మీద సూర్యకాంతి చేత ముందుకు జరిగిన నీడ మళ్ళీ పది మెట్లు ఎక్కేలా చేస్తాను.’” అప్పుడు సూర్యకాంతిలో ముందుకు జరిగిన మెట్లలో పది మెట్లు మళ్ళీ వెనక్కి జరిగింది. యూదారాజు హిజ్కియా జబ్బుపడి తిరిగి ఆరోగ్యం పొందిన తరువాత అతడు రచించిన ప్రార్థన. “నా జీవితం సగభాగంలో నేను పాతాళ ద్వారం గుండా వెళ్ళాల్సివచ్చింది. మిగిలిన సగభాగం నేనిక కోల్పోయినట్టే. యెహోవాను, సజీవుల దేశంలో యెహోవాను చూడక పోయేవాణ్ణి. మృతుల లోకంలో పడిపోయి ఇక మనుషులకు కనిపించనేమో అనుకున్నాను. నా జీవం తీసేశారు. గొర్రెల కాపరి గుడిసెలాగా అది నా దగ్గర నుండి తీసివేశారు. నేతపనివాడు చేసినట్టు నా జీవితాన్ని చుట్టేస్తున్నాను. ఆయన నన్ను మగ్గం నుండి దూరం చేశాడు. ఒక్క రోజులోనే నువ్వు నా జీవితాన్ని ముగిస్తున్నావు. (ఉదయం దాకా ఓర్చుకున్నాను. సింహం లాగా నా ఎముకలన్నిటినీ విరిచేశాడు.) ఒక్క రోజులోనే నువ్వు నన్ను సమాప్తి చేస్తావు. ముళ్ళ తోక పిట్టలాగా కిచ కిచలాడాను. పావురం లాగా కూశాను. పైకి చూసీ చూసీ నా కళ్ళు అలసిపోయాయి. నలిగి పోయాను. యెహోవా, నాకు సహాయం చెయ్యి. నేనేమనగలను? ఆయన నా గురించి మాట పలికాడు, ఆయనే దాన్ని జరిగించాడు. నా హృదయంలో నిండి ఉన్న దుఃఖాన్ని బట్టి నా సంవత్సరాలన్నీ తడబడుతూ గడిపేస్తాను. ప్రభూ, నీవు పంపిన బాధలు మనుషులకు మంచివే. వాటి వల్లనే నా ఆత్మ జీవిస్తున్నది. నువ్వు నన్ను బాగు చేసి నన్ను జీవింపజేశావు. ఆ తీవ్రమైన బాధ వల్లనే నాకు నెమ్మది కలిగింది. నీ ప్రేమతో నా ప్రాణాన్ని నాశనం అనే గోతి నుండి విడిపించావు. నా పాపాలన్నిటినీ నీ వీపు వెనుకకు పారవేశావు. ఎందుకంటే పాతాళంలో నీకు స్తుతి కలగదు. మరణం నీకు స్తుతి చెల్లించదు. సమాధిలోకి వెళ్ళినవారు నీ నమ్మకత్వంపై ఆశ పెట్టుకోరు. సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతిస్తారు! ఈ రోజున నేను సజీవుడిగా నిన్ను స్తుతిస్తున్నాను. తండ్రులు తమ కొడుకులకు నీ సత్యాన్ని తెలియజేస్తారు. యెహోవా నన్ను రక్షించేవాడు. నా జీవిత కాలమంతా యెహోవా మందిరంలో సంగీత వాయిద్యాలు వాయిస్తాను.” యెషయా “ఒక అంజూరు పండ్ల ముద్దను ఆ పుండుకు కట్టండి, అప్పుడు అతడు బాగుపడతాడు” అని చెప్పాడు. దానికి ముందు హిజ్కియా “నేను మళ్ళీ యెహోవా మందిరానికి వెళతాను అనేదానికి సూచన ఏమిటి?” అని అతణ్ణి అడిగాడు.