యెషయా. 59. యెహోవా హస్తం రక్షించలేనంత కురుచగా అయిపోలేదు. ఆయన చెవులు వినలేనంత నీరసం కాలేదు. మీ అపరాధాలు మీకూ మీ దేవునికీ అడ్డంగా వచ్చాయి. మీ పాపాలు ఆయన ముఖం మీకు కనబడకుండా చేశాయి. అందుచేత ఆయన వినడం లేదు. మీ చేతులు రక్తంతో మీ వేళ్లు అపరాధాలతో మరకలయ్యాయి. మీ పెదవులు అబద్ధాలాడుతున్నాయి. మీ నాలుక ద్వేషంతో మాటలాడుతున్నది. ఎవడూ న్యాయంగా దావా వేయడం లేదు. ఎవడూ నిజాయితీతో తన వాదన వినిపించడం లేదు. వాళ్ళు వట్టి మాటలను నమ్ముకుని అబద్ధాలు చెబుతారు. చెడును గర్భం ధరించి పాపాన్ని కంటారు. వాళ్ళు విషసర్పాల గుడ్లను పొదుగుతారు. సాలెగూడు నేస్తారు. ఆ గుడ్లు తినే వాళ్ళు చస్తారు. ఒకవేళ గుడ్డు పగిలితే విషసర్పం బయటికి వస్తుంది. వారి సాలెగూళ్ళు బట్టలు నేయడానికి పనికిరావు. వాళ్ళు నేసిన దానితో ఎవరూ కప్పుకోలేరు. వాళ్ళ పనులు పాపిష్టి పనులు. దుష్టక్రియలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. వారి కాళ్లు పాపం చేయడానికి పరుగెడుతున్నాయి. నిరపరాధుల రక్తాన్ని ఒలకపోయడానికి అవి త్వరపడుతున్నాయి. వారి ఆలోచనలు పాపిష్టి ఆలోచనలు. వారి దారులు దుర్మార్గం, నాశనం. శాంతి మార్గం వారికి తెలియదు. వారి నడతల్లో న్యాయం కనబడదు. వాళ్ళు వంకరదారులు కల్పించుకున్నారు. ఆ దారుల్లో నడిచే వాళ్ళకు శాంతి కలగదు. కాబట్టి న్యాయం మాకు దూరంగా ఉంది. నీతి మమ్మల్ని అందుకోవడం లేదు. వెలుగుకోసం మేము కనిపెడుతూ ఉన్నాం గానీ అంతా చీకటిగానే ఉంది. కాంతి కోసం చూస్తూ ఉన్నాం, గానీ అంధకారంలోనే నడుస్తున్నాం. గోడకోసం గుడ్డివారిలాగా, కళ్ళులేని వారిలాగా తడవులాడుతున్నాం. మసక చీకటి అయినట్టు మధ్యాహ్నకాలంలో కాలుజారి పడుతున్నాము. బలవంతుల మధ్యలో మేము చచ్చిన వాళ్ళలాగా ఉన్నాం. మేము ఎలుగుబంట్లలాగా గుర్రుమంటున్నాం. గువ్వలలాగా మూలుగుతున్నాం. న్యాయం కోసం చూస్తున్నాం, గానీ అది దొరకడం లేదు. విడుదల కోసం చూస్తున్నాం గానీ అది మాకు దూరంగా ఉంది. మా అక్రమాలన్నీ నీ ఎదుట ఉన్నాయి. మా పాపాలు మామీద సాక్ష్యం చెబుతున్నాయి. మా అక్రమాలు మాకు కనబడుతున్నాయి. మా పాపాలు మాకు తెలుసు. యెహోవాను తిరస్కరించి మన దేవుని నుంచి తొలగిపోయి తిరుగుబాటు చేశాం. దుర్మార్గతనూ అవిధేయతనూ ప్రోత్సహించాం. అబద్ధాలూ సణుగులూ మనసులో కల్పించుకున్నాం. న్యాయాన్ని వెనక్కి నెట్టేశాము. నీతి దూరంగా నిల్చుంది. సత్యం నడివీధిలో పడి ఉంది. నిజాయితీ లోపలికి రాలేదు. విశ్వసనీయత ఎటో పోయింది. దుర్మార్గాన్ని విసర్జించేవాడు దోపిడీకి గురి అవుతున్నాడు. న్యాయం జరగకపోవడం చూసి యెహోవా ఎంతో బాధపడ్డాడు. ప్రజలకోసం విన్నపం చేసేవాడెవడూ లేకపోవడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. అందుచేత ఆయన సొంత హస్తమే ఆయనకు విడుదల తెచ్చింది. ఆయన నీతి ఆయన్ని నిలబెట్టింది. నీతిని కవచంగా ఆయన ధరించుకున్నాడు. రక్షణను తల మీద శిరస్త్రాణంగా ధరించుకున్నాడు. ప్రతీకారమనే బట్టలు వేసుకున్నాడు. ఆసక్తిని పైబట్టగా వేసుకున్నాడు. వాళ్ళు చేసిన దానికి తగ్గట్టుగా తిరిగి చేస్తాడు. ఆయన తన విరోధులను కోపంతో శిక్షిస్తాడు. తన శత్రువులపట్ల ప్రతీకారం తీర్చుకుంటాడు. ద్వీపవాసులను కూడా తగురీతిగా శిక్షిస్తాడు. పడమటి దిక్కున ఉన్నవాళ్ళు యెహోవా నామానికి భయపడతారు. సూర్యోదయ దిక్కున ఉన్నవాళ్ళు ఆయన మహిమకు భయపడతారు. యెహోవా ఊపిరితో కొట్టుకుపోయే ప్రవాహంలాగా ఆయన వస్తాడు. “విమోచకుడు సీయోను వస్తాడు. యాకోబు వంశంలో తిరుగుబాటు చేయడం మానిన వారి దగ్గరికి విమోచకుడు వస్తాడు.” ఇదే యెహోవా వాక్కు. “నేను వారితో చేసే నిబంధన ఇది. నీ మీద ఉన్న నా ఆత్మ, నేను నీ నోట ఉంచిన మాటలు, నీ నోటినుంచీ నీ పిల్లల నోటి నుంచీ ఇది మొదలుకుని ఎప్పటికీ తొలగిపోవు” అని యెహోవా చెబుతున్నాడు.