51
ప్రధాన సంగీతకారుడి కోసం. బత్షెబతో పాపం చేసిన తర్వాత దావీదు దగ్గరకు నాతాను వచ్చినప్పుడు దావీదు రాసిన కీర్తన.
దేవా, నీ నిబంధన కృప కారణంగా నన్ను కనికరించు. నీ అధికమైన కరుణను బట్టి నా దోషాలను తుడిచివెయ్యి.
నా అతిక్రమం పోయేలా నన్ను శుభ్రంగా కడుగు. నా పాపం నుండి నన్ను పవిత్రపరచు.
నా అతిక్రమాలేంటో నాకు తెలుసు. నేను చేసిన పాపం నా కళ్ళ ఎదుటే ఉంది.
నీకు వ్యతిరేకంగా, కేవలం నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను. నీ దృష్టికి ఏది దుర్మార్గమో దాన్నే నేను చేశాను. నువ్వు మాట్లాడేటప్పుడు సత్యం మాట్లాడుతావు. నువ్వు తీర్పు తీర్చేటప్పుడు న్యాయవంతుడిగా ఉంటావు.
ఇదిగో, నేను పాపంలో పుట్టాను. నా తల్లి నన్ను గర్భం ధరించిన క్షణంలోనే నేను పాపంలో ఉన్నాను.* 51:5 ఇదిగో, నేను పాపంలో పుట్టాను. నా తల్లి నన్ను గర్భం ధరించిన క్షణంలోనే నేను పాపంలో ఉన్నాను. క్రైస్తవులు చాలా మంది ఈ వచనాన్ని పొరపాటుగా అర్థం చేసుకుంటారు. నా తల్లి పాపంలో నన్ను గర్భం దాల్చింది అంటే, ఆమె పాపం చేయడం మూలంగా నేను పుట్టాను అనుకుంటారు. అంటే తల్లి, తండ్రి నన్ను కనడం కోసం చేసే లైంగిక క్రియ పాపం అనే అభిప్రాయంలో ఉంటారు. భార్యాభర్తల మధ్య జరిగేది ఒక్కనాటికీ పాపం ఎంతమాత్రం కానేరదు. పరిశుద్ధ వివాహం చేసుకున్న వారి మధ్య లైంగిక క్రియ పవిత్రం. స్త్రీ సాంగత్యం వలన అపవిత్రం కాని వారు అని ప్రకటన 14:4 లో రాసి ఉన్న దాన్ని కూడా ఈ విధంగానే అపార్థం చేసుకుంటారు. దీన్నిబట్టి పెళ్లి చేసుకున్న వారు తప్పనిసరిగా అపవిత్రులేననీ, పవిత్రంగా ఉండడం అంటే బ్రహ్మచారిగా కన్యగా ఉండిపోవడం అనీ భావిస్తారు. పరిశుద్ధ వివాహంలో జత అయిన వారిని వివాహ సంబంధం ఎంత మాత్రం అపవిత్రులుగా చెయ్యదు. అలాగైతే దేవుడు వివాహాన్ని నియమించే వాడే కాదు.
ఈ వచనానికి అర్థం నేను తల్లి కడుపులో పడిన క్షణం నుంచీ పాపినే అని.
ఇదిగో, నువ్వు నా హృదయంలో నమ్మదగ్గవాడుగా ఉండాలని నువ్వు కోరుతున్నావు. నా హృదయంలో జ్ఞానాన్ని తెలుసుకునేలా చేస్తావు.
నన్ను హిస్సోపుతో శుభ్రం చెయ్యి. నేను పవిత్రుణ్ణి అవుతాను. నన్ను కడుగు. నేను మంచు కంటే తెల్లగా ఉంటాను.
నువ్వు విరిచిన ఎముకలు హర్షించడానికై ఆనందమూ, సంతోషమూ నాకు వినిపించు.
నా పాపాలనుండి నీ ముఖం తిప్పుకో. నా దోషాలన్నిటినీ తుడిచి పెట్టు.
10 దేవా, నాలో పవిత్రమైన హృదయం సృష్టించు. నాలో సరైన మనస్సును పునరుద్దరించు.
11 నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయవద్దు. నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయవద్దు.
12 నీ రక్షణలోని ఆనందాన్ని నాలో తిరిగి దయచెయ్యి. అంగీకరించే ఆత్మతో నన్ను బలపరచు.
13 అప్పుడు అతిక్రమాలు చేసేవాళ్ళకు నీ మార్గాలు బోధిస్తాను. అప్పుడు పాపులు నీ వైపు తిరుగుతారు.
14 నా రక్షణకు ఆధారమైన దేవా, రక్తాన్ని చిందించినందుకు నన్ను క్షమించు. నీ నీతిన్యాయాలను బట్టి నేను ఆనందంతో బిగ్గరగా గానం చేస్తాను.
15 ప్రభూ, నా పెదాలను తెరువు. నా నోరు నీకు స్తుతి పాడుతుంది.
16 నీకు బలుల్లో సంతోషం ఉండదు. ఒకవేళ నువ్వు బలినే కోరుకుంటే నేను అర్పిస్తాను. దహన బలుల్లో నీకు సంతోషం ఉండదు.
17 విరిగిన మనస్సే దేవునికి సమర్పించే నిజమైన బలి. దేవా, విరిగి పరితాపం చెందిన హృదయాన్ని నువ్వు తిరస్కరించవు.
18 నీ సంతోషాన్ని బట్టి సీయోనుకు మేలు చెయ్యి. యెరూషలేము గోడలను తిరిగి నిర్మించు.
19 అప్పుడు నీతిమయమైన బలులు నీకు సంతోషం కలిగిస్తాయి. దహనబలుల్లోనూ, సర్వాంగ బలుల్లోనూ నువ్వు సంతోషిస్తావు. అప్పుడు ప్రజలు నీ బలిపీఠంపై ఎద్దులను అర్పిస్తారు.

*51:5 51:5 ఇదిగో, నేను పాపంలో పుట్టాను. నా తల్లి నన్ను గర్భం ధరించిన క్షణంలోనే నేను పాపంలో ఉన్నాను. క్రైస్తవులు చాలా మంది ఈ వచనాన్ని పొరపాటుగా అర్థం చేసుకుంటారు. నా తల్లి పాపంలో నన్ను గర్భం దాల్చింది అంటే, ఆమె పాపం చేయడం మూలంగా నేను పుట్టాను అనుకుంటారు. అంటే తల్లి, తండ్రి నన్ను కనడం కోసం చేసే లైంగిక క్రియ పాపం అనే అభిప్రాయంలో ఉంటారు. భార్యాభర్తల మధ్య జరిగేది ఒక్కనాటికీ పాపం ఎంతమాత్రం కానేరదు. పరిశుద్ధ వివాహం చేసుకున్న వారి మధ్య లైంగిక క్రియ పవిత్రం. స్త్రీ సాంగత్యం వలన అపవిత్రం కాని వారు అని ప్రకటన 14:4 లో రాసి ఉన్న దాన్ని కూడా ఈ విధంగానే అపార్థం చేసుకుంటారు. దీన్నిబట్టి పెళ్లి చేసుకున్న వారు తప్పనిసరిగా అపవిత్రులేననీ, పవిత్రంగా ఉండడం అంటే బ్రహ్మచారిగా కన్యగా ఉండిపోవడం అనీ భావిస్తారు. పరిశుద్ధ వివాహంలో జత అయిన వారిని వివాహ సంబంధం ఎంత మాత్రం అపవిత్రులుగా చెయ్యదు. అలాగైతే దేవుడు వివాహాన్ని నియమించే వాడే కాదు. ఈ వచనానికి అర్థం నేను తల్లి కడుపులో పడిన క్షణం నుంచీ పాపినే అని.