52
ప్రధాన సంగీతకారుడి కోసం. ఎదోము వాడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంట్లో ఉన్నాడు, అని చెప్పినప్పుడు దావీదు రాసిన దైవధ్యానం.
1 బలశాలీ, సమస్యను సృష్టించి* 52:1 సమస్యను సృష్టించి చెడ్డ పనులు చేసి ఎందుకు గర్విస్తున్నావు? దేవుని నిబంధన కృప నిత్యమూ ఉంటుంది.
2 నీ నాలుక నాశనాన్ని ఆలోచిస్తుంది. అది పదునైన కత్తిలా వంచన చేస్తూ ఉంది.
3 నువ్వు మంచి కంటే దుర్మార్గాన్ని ఎక్కువ ప్రేమిస్తావు. న్యాయం మాట్లాడటం కంటే అబద్దం మాట్లాడటం నీకిష్టం.
4 కపటమైన నాలుకా! ఇతరులను మింగేసే మాటలను నువ్వు ప్రేమిస్తావు.
5 కాబట్టి దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు. ఆయన నిన్ను నీ గుడారంలో నుండి పెరికి వేస్తాడు. సజీవులుండే ప్రాంతం నుండి నిన్ను పెల్లగిస్తాడు.
6 న్యాయవంతులు అది చూసి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారు. వారు నవ్వుతూ ఇలా అంటారు.
7 చూడండి, ఇతడు దేవుణ్ణి తన బలంగా చేసుకోకుండా తనకున్న అధిక ఐశ్వర్యంపై నమ్మకముంచాడు. నాశనకరమైన తన మార్గంలోనే స్థిరంగా నిలిచాడు.
8 కానీ నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను. దేవుని నిబంధన కృపలో నేను ఎన్నటికీ నమ్మకముంచుతాను.
9 దేవా, నువ్వు చేసిన వాటిని బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. నీ భక్తుల సమక్షంలో నీ నామాన్ని బట్టి ఆశతో ఎదురుచూస్తాను.